Translate

  • Latest News

    3, డిసెంబర్ 2019, మంగళవారం

    మర్మస్థానం కాదది... నీ జన్మస్థానం...




    మర్మస్థానం కాదది... నీ జన్మస్థానం... మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం.. 30 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన ప్రతిఘటన సినిమాలో వేటూరి రాసిన పాట . సినిమాలో లెక్చరర్ విజయశాంతి ని విద్యార్థులు అసభ్యంగా బ్లాక్ బోర్డు మీద బొమ్మ గీసి హేళన చేసినప్పుడు... విజయశాంతి స్టూడెంట్స్ కళ్ళు తెరిపించడానికి పాడే పాట అది... వేటూరి కలం కత్తిలా ఝుళిపించి దూసిన  సాహిత్యం అది. అప్పటికింకా సెల్ ఫోన్లు రాలేదు... యువత చెడిపోవడానికి ఇప్పుడున్నంత విస్తృత అవకాశాలు లేవు.. ఎదో కొద్దీ శాతం మంది యువత మాత్రం బడ్డీ కొట్లలో దొరికే బూతు సాహిత్యం దొంగచాటుగా చదవడం... కొన్ని ప్రత్యేకమైన సినిమా హాళ్లల్లో సినిమా మధ్యలో ప్రదర్శించే బి.ఎఫ్ బిట్ల కోసం అంగలార్చుకుంటూ చూడడం తప్ప... అప్పట్లోనే తప్పుదోవ పడుతున్న యువతను సరిదిద్దడానికి ఇటువంటి పాట ఒకటి అవసరమైనది. వేటూరి అంత సూటిగా...ఘాటుగా చెప్పేసరికి సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆలోచనలో పడింది.. మరి ఇప్పుడు అరచేతిలో సెల్ ఫోన్... ఓపెన్ చేస్తే... వేల  సంఖ్యలో పోర్న్ సైట్స్... అవి చూసి మూతి మీద మీసం రాని టీనేజ్ పిల్లవాడు కూడా రేపులు చేసి పారేస్తున్నాడు... మైనర్లు కూడా మృగాళ్ళుగా మారడానికి ఈ సెల్ ఫోన్లే కారణం... 

    ఏడేళ్ల కిందట ఢిల్లీలో నిర్భయ ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చింది. ఇటువంటి దురంతాలు ఇక జరగవని ఆశించాం.. కానీ మరింత పెరిగాయి.. నగరాలు, పట్టణాలు, గ్రామాలూ.. ఎక్కడ పడితే అక్కడ... నెలల పసికందు నుంచి... 80 ఏళ్ల బామ్మ వరకు ఆడదిగా పుట్టడమే శాపమయింది. కామాంధుల అకృత్యాలకు నిత్యం ఎందరో బలవుతూనే ఉన్నారు.. 

    వేటూరి గారే అన్నట్టు శిశువులుగా పుట్టి మీరు పశువులుగా మారితే... మానవ రూపంలోనే దానవులుగా పెరిగితే... ఏమైపోతుంది... సభ్య సమాజం...  ఏమైపోతుంది...మన భారత దేశం... మరిప్పుడు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఎంత మంది వేటూరి లు తమ కలాల్ని కత్తులుగా దూసినా ఎన్ని ప్రతిఘటనల లాంటి సినిమా పాటలు వచ్చినా మార్పు రానంతగా మొద్దుబారిపోయిందీ సమాజం... ఒరేయ్... స్తీ జననాంగాన్ని మర్మస్థానంగా.... నీ నరాల్లో వేడి చల్లార్చుకునే శీతల కేంద్రంగా చూడొద్దురా... అది సృష్టికి ప్రతి సృష్టి చేసే... రేపు నీ బిడ్డలకు జన్మనిచ్చే పుణ్య క్షేత్రంగా చూడండిరా.. అని జ్ఞానోదయం చేయాల్సిన అవసరం ఉంది. 


    మనం మన పిల్లలకు చిన్ననాటి నుంచి నూరిపోయాల్సింది పర లోక ప్రాప్తి కోసం చేసే ప్రార్ధనలు...ముక్తి మార్గాలు కాదు..మంత్రాలూ..శ్లోకాలు..పనికిరాని పూజలు కాదు... ఇహ లోకంలో సభ్యతగా...సంస్కారంగా ఎలా బతకాలో నేర్పించాలి.. మన పుట్టుక..పూర్వాపరాలు పూసగుచ్చినట్టు చెప్పాలి... సైన్స్ పాఠాలు నిస్సిగ్గుగా బోధించాలి... నిన్ను పుట్టించింది ఏ దేవుడో కాదు... మీ అమ్మ..నాన్నల శారీరక కలయిక సందర్భంగా ఎక్స్, వై క్రోమోజోముల కలయికలో నువ్వు పుట్టావు.. నువ్వు మగాడివని మిడిసిపడకు ,,,  ఆ క్రోమోజోముల కలయికలో కాస్త అటూ ఇటూ మారితే నువ్వు ఆడపిల్లగా పుట్టేవాడివి...అప్పుడు ఒక మగవాడు నీ వంక ఎలా కామోద్రేకంతో చూస్తే నీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో.. అని తెలియచేయాలి.. అందుకే మగ, ఆడా అంతా సమానమే..జస్ట్ క్రోమోజోముల మాయాజాలం అని  అని చిన్నప్పటి నుంచి వారికి అర్ధమయ్యేటట్టు బోధించాలి...  సమాజంలో మేధావులు, తల్లిదండ్రులు అందరూ సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన తక్షణ సమస్య ఇది.. మేధావుల్లారా.. ఒక్కసారి ఆలోచించండి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మర్మస్థానం కాదది... నీ జన్మస్థానం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top