అవును... అంతం కాదిది... ఆరంభం... ఇంకో నెలో..రెండు నెలలో.. మూడు నెలలో జాగ్రత్తలు పాటిస్తే కరోనాను అంతం చేయవచ్చని అనుకుని సంబరపడుతున్నారా... అయితే మీరు పప్పులో కాలేసినట్టే... ఇది అంతం... కాదు ఆరంభం మాత్రమే...భవిష్యత్తులో ఇలాంటి వైరస్ లు మరెన్నో రానున్నాయి.. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్నది కాదు. ఇవి చేదు నిజాలు. ఇది ఏ ఒక్క చైనా తప్పిదమో... అమెరికా తప్పిదమో కాదు... ఆధునిక ప్రపంచంలో మనిషి తన ఆహారపు అలవాట్లలో భాగంగా సహజత్వాన్ని విడిచిపెట్టి అసహజ పద్ధతుల్లో తయారుచేసిన ఆహారం తినడం ఎప్పుడైతే ప్రారంభించాడో... అప్పటినుంచి ఈ ప్రమాదం పొంచి ఉండి గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా అది వివిధ రూపాల్లో కాటు వేయడం మొదలెట్టింది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు అది రకరకాలుగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంది. 2004 లో సార్స్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రాణాలు తీసింది. ఈ వైరస్ కూడా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించినదే... ఆ తర్వాత స్వైన్ ఫ్లూ (హెచ్ 1 ఎన్ 1) కూడా చాలా దేశాల్లో వేలాదిమందిని బలి తీసుకుంది. ఇవి కాక ఎబోలా వైరస్, జిక వైరస్ వంటివి కూడా తమ ప్రతాపాలను చూపించి వెళ్లాయి. ఓవరాల్ గా చూస్తే ఈ వైరస్ లు అన్నీ అమెరికా లాంటి దేశాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న మాంస ఉత్పత్తి కంపెనీల నుంచే పుడుతున్నాయనేది కొందరు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తెలుస్తోంది... ఉదాహరణకు నాటు కోడి కి, ఫారం కోడి కి ఎంత తేడా ఉందో మీకు తెలిసిందే కదా... సహజంగా పెరిగిన నాటు కోడి మాంసం ఆరోగ్యానికి ఏంతో మంచిది. కానీ త్వరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే యావతో ఎప్పుడైతే మనిషి కోడి మాంసం అమ్మకాన్ని ఒక సంపాదన తెచ్చిపెట్టే పరిశ్రమగా భావించాడో... దాంతో ఆ కోళ్లు త్వరగా పెరగడానికి వాటికి ఇంజెక్షన్లు ఇచ్చి... వాటిని అసహజ పద్ధతుల్లో త్వరగా ఎదిగేలా చేసి అమ్ముకుని సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడో... అప్పుడే మన ఆరోగ్యాలకు ప్రమాదం మొదలైనది. అయితే అది కోళ్ల విషయంలో అంత తీవ్రంగా లేనప్పటికీ ఇక్కడ మనం కోళ్ల ఫారాలు ఎలా పెంచుతామో అమెరికాలో పందుల ఫారాలు ఆలా ఉంటాయి... అక్కడ ఉత్పత్తి అయ్యే పంది మాంసం కొన్ని ప్రముఖ మాంసాహార ఉత్పత్తుల కంపెనీలకు, పలు బేకరీ లకు సరఫరా అవుతుంది. ఇలాంటి భారీ పంది మాంసం ఉత్పత్తి కర్మాగారాలు కరోనా లాంటి వైరస్ లకు పుట్టినిళ్లు అని తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం 2011 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచంలో 172 దేశాల్లో మొత్తం 1483 రకాల అంటు వ్యాధులు ప్రబలాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీటిని అధ్యయనం చేసిన గ్లోబల్ ప్రెపేర్డ్ నెస్ మానిటరింగ్ బోర్డు (జి.పీ.ఎం.బి) కరోనా లాంటి మహా విపత్తు త్వరలో రానున్నదని 2019 సెప్టెంబర్ లోనే హెచ్చరించింది. ప్రమాదంలో ప్రపంచం (వరల్డ్ ఎట్ రిస్క్) శీర్షికతో వెలువడిన ఆ నివేదికను ప్రపంచం పట్టించుకోక పోవడం వల్లనే నేడు మనమంతా ఈ మహా ఉపద్రవంలో చిక్కుకున్నాం.. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్ని ఉపద్రవాలు రానున్నాయో... సో... అందరూ అందుకు సిద్ధంగా ఉండండి... ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి అనే ఒక నాగరిక (అనాగరిక) జంతువు చేసిన పాపం పండింది...
నాకు ఇప్పుడు మహానది సినిమాలో కమల్ హాసన్ పాట గుర్తొస్తోంది... (అఫ్ కోర్స్ రాసింది వెన్నెలకంటి అనుకోండి) ఈ మహానది లో మనిషి చేసిన పాపం పొంగినది... ఆ పాతకమంతా మోయగ లేనని గంగే కుంగినది... చివరిగా మరో గ్రీకు కథ కూడా చెప్పుకోవాలి... అనగనగా ఒక రోజు ఒక పెద్దమనిషి ఒక జంతు ప్రదర్శన శాలకు వెళ్ళాడు... వరుసగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళుతున్నాడు... పులులు, సింహాలు, పాములు, ఖడ్గ మృగాలు ఇలా అన్నీ చూశాక చివరగా ఒక గది దగ్గర ఆగాడు... ఆ గది బయట ఒక బోర్డు ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన జంతువు అని రాసి ఉంది. లోపలకు వెళ్లి చూస్తే ఏమి కనిపించలేదు. ఎదురుగా ఒక అద్దం మాత్రం ఉంది... అర్ధమయింది కదా... అదీ సంగతి...
👏👌🙏
రిప్లయితొలగించండి