Translate

  • Latest News

    18, మే 2020, సోమవారం

    20 లక్షల కోట్లు... రాజు గారి దేవతా వస్త్రాలు


    కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదాపు 21 లక్షల కోట్ల ప్యాకేజి చూస్తే... చిన్నప్పుడు విన్న రాజు గారి దేవతా వస్త్రాల కథ గుర్తుకువస్తోంది. రాజుగారి దేవతా  వస్త్రాలు కథ తెలుసుగా...
    అనగనగా  ఒక రాజ్యం... ఆ రాజ్యంలో ఒక రాజు గారు...ఒక రోజు రాజు గారి కొలువుకు ఒక వ్యక్తి వచ్చి  తాను  బంగారం, వెండితో దేవతా వస్త్రాలు నేస్తానని చెప్పాడు.. వెంటనే రాజు గారు మోజుపడి అవి నేయమని  దానికి సరిపడా బంగారం, వెండి సమకూర్చాడు. అతను  ఆ బంగారం, వెండి అంతా దాచేసుకుని... ఉత్తుత్తిగా... దేవతా వస్త్రాలు నేస్తున్నట్టు నటించాడు.  ఒక శుభ ముహూర్తాన నేయడం పూర్తి అయిందని చెప్పి వాటిని ధరించమని రాజు గారికి ఇచ్చాడు. . రాజు గారు అవి ధరించి ఊరేగింపుగా బయలుదేరారు. రాజుగారి   దేవతా వస్త్రాలు ఎలా ఉంటాయో చూద్దామని రాజ్యంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా చూస్తే... రాజుగారి ఒంటి మీద అసలు వస్త్రాలే లేవు.. పూర్తి దిస మొలతో ఉన్నారు. కానీ ఆ మాట ఎవరికీ  పైకి చెప్పే సాహసం లేదు. దేవతా వస్త్రాలు తెలివిగల వాళ్లకు మాత్రమే కనపడతాయని, తెలివి తక్కువ వాళ్లకు కనపడవని చెప్పడంతో ఎవరికి వారు తాము తెలివిగల వాళ్ళమే అని చెప్పుకోవడానికి రాజు గారి ఒంటి మీద బట్టలు ఏమీ లేకపోయినా ఆహా...ఓహో...అద్భుతంగా ఉన్నాయి దేవతా వస్త్రాలు అంటూ పొగడటం ప్రారంభించారు. కల్లా కపటం తెలియని ఒక పిల్లవాడు మాత్రం... రాజు గారు బోసిమొలతో ఉన్నార్రోయ్ అంటూ గట్టిగా అరిచాడు... ఇప్పుడు వర్తమానంలో జర్నలిస్టులది, ప్రతిపక్షాలది  ఆ పిల్లగాడి పాత్ర.
    ఇలాగె మరో కథ గుర్తు వస్తోంది. అనగనగా ఒక రాజ్యం... ఆ రాజ్యంలో ఓ ఏడాది చలి కాలంలో ఎన్నడూ లేనంత భయంకరంగా తీవ్ర చలి గాలులు వీచాయి... కేవలం చలిగాలులకే ముసలి, ముతకా... పిల్లా జెల్లాతో పాటు వందలు..వేల సంఖ్యలో జనం చచ్చిపోతున్నారు. దీంతో రాజు గారు ఒక ప్రకటన చేశారు. రాజ్యంలో ఉన్న గొర్రెలన్నిటికి ఉన్ని కోట్లు ఉచితంగా ఇస్తాను. గొర్రెలన్నీ మహా సంబరపడిపొయ్యాయి. రాజు గారి ఔదార్యాన్ని వేనోళ్ళ కొనియాడాయి. అయితే ఆ గొర్రెల మందలో ఒక గొర్రెకు సందేహం వస్తుంది... అంత  ఉన్ని ఎక్కడ నుంచి తెస్తారు అని. .. ఉండబట్టలేక రాజు గారిని అడిగేస్తుంది.. రాజు గారు తాపీగా చెబుతారు... ఇంకెక్కడి నుంచి... గొర్రెల నుంచే కదా ఉన్ని సేకరించేది అని...  ఇలాగె ఉంది మన కేంద్ర ప్రభుత్వ ప్యాకేజి... మన వేలితోనే మన కంట్లో పొడవడం అంటే ఇదే... 

    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: 20 లక్షల కోట్లు... రాజు గారి దేవతా వస్త్రాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top