Translate

  • Latest News

    1, మే 2020, శుక్రవారం

    మే డే స్ఫూర్తికే తూట్లు...



    సంక్షోభాలు ఎప్పుడూ పేదలకు ఆశనిపాతమే కానీ... పాలకులకు మాత్రం దోపిడీకి సరికొత్త మార్గాలను చూపుతాయి. ఇప్పుడు కరోనా  కూడా   కేంద్ర ప్రభుత్వానికి వరంగా మారింది. ఎప్పటినుంచో అమలు చేయాలన్న కుట్రకు రాజ మార్గం ఏర్పరిచింది... కార్మికుల అణచివేతకు సింహ ద్వారం తెరిచింది. శతాబ్దాల పోరాట స్ఫూర్తిని సమాధి చేయడానికి కాటి కాపరి అవతారం ఎత్తుతోంది.. కరోనా సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. కార్మిక లోకంపై గండ్ర గొడ్డలి ఎత్తుతోంది. మే డే స్ఫూర్తిని తెగనరకడానికి సన్నద్ధమైంది.
       నేటికీ 134 ఏళ్ల కిందట చికాగో నగరంలో కార్మికులు ఏ హక్కు కోసం అయితే తమ రక్తాన్ని చిందించారో... ఏ పని గంటలు తగ్గించాలని వారు పోరాడారో... తమ పోరాటానికి చిహ్నంగా ఏ పిడికిలితో పట్టుకుని తమ రక్తంతో తడిసిన అరుణ పతాకాన్ని ఎగురవేశారో... ఇప్పుడు ఆ పోరాటస్ఫూర్తికే తూట్లు పొడవడానికి భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ ఎత్తిన పిడికిలిని తెగ నరకే అస్త్రాలను తన అమ్ముల పొదిలో రెడీగా ఉంచుకుంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వం కరోనా కు ముందే కార్మికుల పని గంటలు 8 నుంచి 9 గంటలకు పెంచాలనే కుట్రకు బీజం వేసింది. పాలకులకు కరోనా కాలం కలసివచ్చింది.. ఇప్పటికే పత్రికా రంగంలో యాజమాన్యాలు కరోనా సాకు చూపి కార్మికులను తొలగించాయి. ఉన్న కార్మికులకు కూడా వేతనంలో కోత పెట్టాయి. మిగతా రంగాలు లాక్ డౌన్ కారణంగా మూత పడి ఉన్నందున వాటి కుట్రలు ఇంకా బయటపడలేదు కానీ... లాక్ డౌన్ ఎత్తివేయగానే ఆ కుట్రలన్నీ ఒక్కసారిగా భళ్ళున బద్దలవుతాయి. కోట్లాది కార్మికుల జీవితాల్ని గాఢాంధకారంలో పడవేస్తాయనేది రోజూ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత నిజం. కార్మికులంతా ఈ బాధామయ వేదనలో ఉండగానే రాజ్యం పని గంటల పెంపు అనే భయంకరమైన కుట్రకు తెర లేపుతోంది.
    ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన తీసుకువస్తోంది. ఏ హ‌క్కుల కోస‌మైతే నాడు ప్రాణ‌త్యాగాలు చేశారో ఆ హ‌క్కుల‌ను హ‌రించివేసేలా కొత్త ప‌న్నాగం ప‌న్నుతోంది.  కార్మికులు ప్రస్తుతం పని చేస్తున్న 8  గంటల పని దినాన్ని ఏకంగా 12 గంట‌లకు పెంచాలని  ఇప్ప‌టికే సంకేతాలు పంపింది. .ఇప్ప‌టికే కాగితాల్లో ఉన్న చ‌ట్టాల‌కు, ఆచ‌ర‌ణ‌కు ఎంతో వ్య‌త్యాసం ఉండ‌గా, నేరుగా చ‌ట్ట‌రూపంలోనే 12 గంట‌ల ప‌ని గంట‌లను  కార్మికుల‌పై రుద్ద‌నున్నారు. అవును కార్మికులు త్యాగాలు చేయాల్సిందేనని ఆదేశించనుంది. కరోనా ను అడ్డం పెట్టుకుని కార్పొరేట్లకు కొమ్ము కాయడానికి ప్రభుత్వం పన్నుతున్న ఎత్తుగడ ఇది. ఇదే అదునుగా కార్మిక సంఘాల‌ను ఛిన్నాభిన్నం చేస్తూ ప్ర‌భుత్వం  ప‌థ‌క ర‌చ‌న చేస్తోంది. సో... కార్మికులారా ఏకం కండి... పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప... మరో చారిత్రక పోరాటానికి సిద్ధం కండి... ఇంక్విలాబ్ జిందాబాద్... 
          

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మే డే స్ఫూర్తికే తూట్లు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top