Translate

  • Latest News

    24, మే 2020, ఆదివారం

    సంక్షేమం పైనే ఫోకస్



    ఎట్టకేలకు రాకుమారుడి పట్టాభిషేకం పూర్తయి...సింహాసనాన్ని అధిష్టించాడు.. ఇక రాజ్య పాలన ప్రారంభించాడు ... ఈ ప్రపంచంలో కోరికలు లేని వారంటూ ఉండరు... బుద్ధుడు చెప్పినట్టు కోరికలు చంపుకుని బతకాలంటే వారు సర్వ సంగ పరిత్యాగులు అవుతారే కానీ రాజ్య పాలకులు కాలేరు... ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి... కొందరిది ధన కాంక్ష అయితే...మరికొందరికి కీర్తి కాంక్ష...ఇంకొందరికి కామ కాంక్ష... అందుకే పెద్దలు ఏనాడో చెప్పారు... కీర్తి...కాంత...కనకం... అని... ప్రపంచంలో ఏ యుద్ధాలు జరిగినా ఈ మూడింటి కోసమే జరిగాయి... ప్రపంచ విజేత అలెగ్జాన్డర్ ది కీర్తి కాంక్ష... ఈ ప్రపంచాన్ని మొత్తం జయించి ప్రపంచ విజేత కావాలని... అలాగే... ఇక్కడ మన రాజకుమారుడిది కీర్తి కాంక్షే... ఆ విషయం ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పాడు..తానేమి దాచుకోలేదు... నాకు డబ్బు కాంక్ష లేదు.. (చంద్రబాబు అండ్ కో ఆరోపించినట్టు లక్ష కోట్లు తిన్నాడనేది వాస్తవం కాకపోయినా... ఆయన పుడుతూనే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాడే...) ఉన్నదల్లా ఒకటే కీర్తి కాంక్ష... తన తండ్రి లాగే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుని తన తండ్రి చేసిన మంచి పనుల కంటే ఇంకో నాలుగు  పనులు ఎక్కువ  చేయాలని.... ప్రతి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కన తన ఫొటో పెట్టుకోవాలని... అదే ఆయన ఆకాంక్ష... ఇదే విషయం ఎన్నికల ముందు పదే పదే చెబుతుంటే...  ఆయనకు అర్జెంటు గా ముఖ్యమంత్రి అయిపోవాలని ఆత్రం... అని ప్రతిపక్షాలు విమర్శించాయి... నిజమే మరి ఈ ఆత్రం జగన్ కే  కాదు... ఆయన తండ్రికి  కూడా ఉండేది...  ఆయన కూడా అతి చిన్న వయసులో అంటే 33 ఏళ్ల వయసుకే  పి.సి.సి. అధ్యక్షుడు అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి ఇంకో 21 ఏళ్ళు ఆగవలసి వచ్చింది... ఈ మధ్య కాలంలో అధిష్టానం కుర్చీలాట ఆడినప్పుడల్లా ఆయన కూడా ఆటలో పాల్గొంటూ ఉన్నాడే కానీ... మ్యూజిక్ ఆపేసరికి కుర్చీ దూరంగా ఉండేది... ముందున్న మనిషి ఆ కుర్చీలో కూర్చునే వాడు.. అప్పుడు కూడా చాలా మంది రాజశేఖర రెడ్డి ని అన్నారు... ఆయనకు ఆత్రం ఎక్కువ... ఆ కుర్చీ కోసమే హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించాడని... ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు మీద చెప్పులు వేయించాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు... నిజమే... తండ్రి,కొడుకులు ఇద్దరికీ ఆత్రం ఎక్కువ... త్వరగా ఆ సీట్లో కూర్చుని మంచి పనులు చేసేసేయాలని... ప్రజల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలని.. పెద్దాయన అలాగే అవకాశం దొరకగానే  ఐదేళ్లలో 50 ఏళ్లకు సరిపడా మంచి పనులు చేసి అదృశ్యమైపోయాడు... జనం గుండెల్లో మాత్రం భద్రంగా ఉండిపోయాడు...
     ఇప్పడు సింహాసనం అధిష్టించిన రాకుమారుడుది అదే వరస... ఎక్కిన రోజే చెప్పాడు... ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని... అదే ఆత్రంతో తొలి రోజు నుంచే పని మొదలెట్టాడు... దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు సాహసోపేత సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ఆరు నెలలు కాదు...ఆరు రోజుల్లోనే శభాష్ అనిపించుకున్నాడు.. మేనిఫెస్టో ను భగవద్గిత, ఖురాన్, బైబిల్ అని అంటే ఏదో ఓట్ల కోసం వాడే డైలాగ్ అనుకున్నారు కానీ.. అక్షరాలా అన్న మాటను ఆచరణలో పెడతాడని ఎవరూ అనుకోలేదు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉన్నా...  మేనిఫెస్టో లో చెప్పిన వాటిలో 90 శాతం తొలి ఏడాది లోనే చేసి చూపించాడు.. చెప్పనివి కూడా చాలా చేశాడు. బి.సి. ఎస్సి. ఎస్టీ, మైనార్టీలకు నామినెటేడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా... వారు ఆర్ధికంగా కూడా ఎదగాలని నామినేటెడ్ కాంట్రాక్టుల లోను 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప విప్లవాత్మక పరిణామం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఇలా ఇంత నిజాయితిగా వ్యవహరించిన దాఖలాలు లేవు.  గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్దించేందుకు పునాదులు బలంగా వేసాడు... అయితే... మొదటి ఏడాది అంతా పూర్తిగా సంక్షేమం పైనే ఫోకస్ చేశాడు. ఏ ప్రభుత్వానికి అయినా సంక్షేమం, అభివృద్ధి... రెండు కళ్ళు లాంటివి.. రాజశేఖర రెడ్డి ఆలా చేయబట్టే చరితార్థుడయ్యాడు. మరి రాకుమారుడు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి ని పెద్దగా పట్టించుకోలేదు... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పినట్టు ఇది సంక్షేమ నామ  సంవత్సరమే... ఆయనే చెప్పినట్టు మిగతా నాలుగేళ్లు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తే నిజంగా స్వర్ణ యుగమే...
    అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఈ ఏడాది కాలంలో ఓ పక్క తన సంక్షేమ  కార్యక్రమాలతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో మూడు రాజధానుల ఏర్పాటు వంటి తన దుందుడుకు నిర్ణయాలతో అంత వివాదాస్పదుడు అయ్యాడు.. తొలి  ఏడాదిలో నడక నేర్చుకునే క్రమంలో తప్పటడుగులు వేశాడు.  ఏడాది కాలంలోనే హైకోర్టు చేత 60 సార్లు మొట్టికాయలు వేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి గా కూడా అప్రతిష్ట తెచ్చుకున్నాడు. అవి చంద్రునిపై మచ్చలా  ఉండిపోయాయి... మరి ఆ మచ్చల గురించి... తప్పటడుగుల గురించి  రేపటి వ్యాసంలో ముచ్చటించుకుందాం... 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సంక్షేమం పైనే ఫోకస్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top