Translate

  • Latest News

    25, మే 2020, సోమవారం

    తప్పటడుగులు సరిచేసుకుంటే తిరుగుండదు...


    న‌డ‌క కొన‌సాగుతున్న‌ప్పుడే త‌ప్ప‌ట‌డుగులు ప‌డేవి. ప‌రిపాల‌నలో కొత్త సంస్క‌ర్ణ‌లు తలపెట్టినపుడే వాటిపై చ‌ర్చ జరిగేది. ఉన్న‌ది ఉన్న‌ట్లు ఉంటే అస‌లు స‌మ‌స్యే లేదు. కాని ఇలా ఎందుకు ఉండాలి.. మార్పు తీసుకురావాల‌నుకున్న‌ప్పుడు మాత్రం  కొన్ని విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు.  ఇప్పుడు సంవ‌త్స‌ర పాల‌న‌లో ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి చేప‌ట్టిన అనేక సంస్క‌ర్ణ‌లు, ప‌థ‌కాలు పలు చర్చలకు  దారితీశాయి.  కొన్నిసందర్భా‌ల్లో ప్ర‌తిప‌క్షాల నోళ్ల‌కు జ‌గ‌నే ప‌నిచెప్పారు. జ‌గ‌న్  ముక్కుసూటిగా తాను అనుకున్న‌ది.. తాను చేయాల‌నుకున్న‌వి చేసుకుపోతున్నాడు.  ప‌ద‌వి చేప‌ట్టిన వెంటనే తీసుకున్న ఇసుక సంస్క‌ర్ణ‌లు కూలీల‌కు, భ‌వన నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొన్ని నెలల పాటు తీవ్ర  ఇబ్బందుల పాలు చేశాయి.
    అనంతరం  రాజధాని మార్పు విషయం. ప్రధాన ప్రతిపక్ష మైన తెలుగుదేశం ను చావు దెబ్బ కొట్టడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్... అయితే ఇది ఒక్క తెలుగుదేశం తోనే ముడిపడి లేదు. ఒక్క సామాజిక వర్గానికే సంబంధించింది కాదు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల మనోభీష్టానికి సంబంధించినది. అంతే  కాదు వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇందులో ఇమిడి ఉంది. జగన్ నిర్ణయంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయింది. దాని ప్రభావం దానిపై ఆధారపడి బతుకుతున్న అన్ని వర్గాలపై ఉంటుంది. సరే...జగన్ కు ఇక్కడ లాస్ అయినా... ఉత్తరాంధ్ర లో పార్టీలకు అతీతంగా ప్రజా మద్దతు వెల్లువలా వస్తుంది... ఓ.కే... కాబట్టి రాజకీయంగా ఆయనకు పెద్ద నష్టం ఉండకపోవచ్చు. అయితే దీనిని త్వరగా అమలు చేయాలనే ఆతృతలో జగన్ తీసుకున్న మరో తొందరపాటు నిర్ణయం శాసనమండలి రద్దు నిర్ణయం. జగన్ ఒక ఏడాది ఆగి ఉంటే శాసనమండలి లో వారి బలం పెరిగేది... కానీ అప్పటిదాకా ఆగలేక మండలి రద్దు చేయడం... తదనంతర పరిణామాలు జగన్ ను అనవసరంగా చిక్కుల్లో పడవేశాయి.
    ఇక   విద్యాసంస్క‌ర్ణ‌లు తీసుకుందాం. ఇది చాలా మంచి నిర్ణయం. జ‌గ‌న్ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, పేద‌ల‌ పిల్ల‌లు సైతం పోటీ ప్ర‌పంచంలో నిల‌వాల‌ని, త‌ద్వారా వారి జీవితాల్లో మార్పులు తేవాల‌ని ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే ప్రాధ‌మిక విద్య నుంచే ఈ మార్పులు ప్రారంభం కావాల‌ని ఆకాంక్షించారు.  ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో పేద‌,బ‌డుగు,బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌లు అనుభ‌విస్తున్న ప‌రిస్థితిని స్వ‌యంగా చూశారు.  పేదలు త‌మ పిల్ల‌లు ప‌నికి వెళితే త‌మ కుటుంబాల‌కు ఆస‌రాగా  ఉంటార‌ని బడికి పంపకుండా పనులకు పంపడాన్ని గమనించారు.  ఈ ప‌రిస్థితిని అధిగ‌మించ‌టానికి త‌ల్లుల ఖాతాల్లోకి నేరుగా డ‌బ్బులు వేయ‌టం వ‌ల్ల పిల్ల‌లను ఎట్టిప‌రిస్థితిలో బ‌డిలోనే ఉంచుతారు. ఈ ప‌థ‌కం వారి భ‌విష్య‌త్తుకు బంగారు బాట వేయ‌టానికి ఉపయోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే పాఠ‌శాల మౌలిక వ‌సతులు అభివృద్ది, ఇంగ్లీషు మీడియం , జ‌గ‌న‌న్న విద్యాకానుక, విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన‌ ప‌థ‌కాలు విద్యావ్య‌వ‌స్థ తీరుతెన్నుల‌ను స‌మూలంగా మార్చివేశాయి. అయితే ఇందులో ఇంగ్లీషు మీడియంపై  జ‌రిగిన దుమారం అంతా ఇంతా కాదు. మేధావులు అనుకున్న వారు సైతం దీనిని వ్య‌తిరేకించారు. ఈ పధకం ప్రవేశపెట్టే ముందే మేధావులు, ఉపాధ్యాయ సంఘ నాయకులతో సాధక బాధకాలు చర్చించి ఉంటె బాగుండేది.  ఇంగ్లీషు మీడియం ప్ర‌వేశ పెట్టాల‌ను కున్నప్పుడు ఒక క‌మిటి వేసి ఆ క‌మిటి నిర్ణ‌యం ప్రకారం అమలు చేసి ఉంటె  కోర్టు వ‌ర‌కు వెళ్లే  అవ‌కాశం ప్ర‌తిప‌క్షాల‌కు లేకుండా పోయేది.
    ఇటీవల వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ విషయం... ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా తన పరిధిని అతిక్రమించి మాట్లాడాడు అని అనుకున్నప్పుడు ఒక మెమో ఇస్తే సరిపోయేది...పోనీ  సస్పెన్షన్ చేశారు. దాంతో ఆయన రోడ్డెక్కి డైరెక్టుగా జగన్ ను బండ బూతులు తిట్టడం అతను చేసిన తప్పు... కానీ దానికి పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి ప్రభుత్వాన్నీ ఇబ్బందుల పాలు చేశారు. ఒక ప్రభుత్వ డాక్టర్ ను పెడరెక్కలు విరిచి కట్టి, చొక్కా లేకుండా... ఆటోలో పడవేసి తీసుకువెళ్లడం...పైగా... పిచ్చివాడని వారే సర్టిఫై చేసేసి మెంటల్ హాస్పిటల్ కు పంపడం హేయమైన చర్య. పోలీసులకు జగన్ ప్రభుత్వం ఫ్రీహ్యాండ్  ఇవ్వడం మంచిదే కానీ... వాళ్లకు ఫ్రీహ్యాండ్ ఇస్తే... ఇదుగో ఇలాగే ప్రభుత్వానికి లేనిపోని చెడ్డ పేరు తెస్తుంటారు..
    విద్యుత్ బిల్లులు విషయం కూడా ఇక్కడ చెప్పాలి. బిల్లు చూస్తే  ప్రజల గుండెలు గుభేలుమంటున్నాయి. వందల్లో రావాల్సిన బిల్లులు వేలల్లో వచ్చాయి. మేమంతా కరెక్ట్ గా  ఇచ్చాము. ఇంట్లో ఉండి  మీరే ఎక్కువ వాడారు  అని ప్రభుత్వం చెబుతోంది. ఎంత వాడినా మరీ అంత బిల్లు ఎలా వస్తుందన్నది జనం ప్రశ్న. అయితే జూన్ 30 వరకు గడువు ఇస్తున్నట్టు జగన్ ప్రకటించడంతో తాత్కాలికంగా ఈ గొడవ సద్దుమణిగింది.
     ఇలా ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాద‌స్పందంగా మారుతున్నాయి. కోర్టు తీర్పులు కూడా జ‌గ‌న్ పరిపాల‌న‌కు అడ్డంకి గా  మారుతున్నాయి.  పాల‌న‌పై దీని ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. అధికారులు సైతం  ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లు విషయంలో  ముందు..వెనుకా  అలోచించే అవ‌కాశం ఉంది. సో.. ఇకనైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు  ఆచి..తూచి...  భవిష్యత్తులో ఎదురవబోయే పరిణామాలు...వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను కూడా పరిగణన లోకి తీసుకుని మరీ వ్యవహరిస్తే మంచిది. తొలి ఏడాదిలో వేసిన తప్పటడుగులు సరిదిద్దుకుంటే... జగన్ కు తిరుగే ఉండదు...



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తప్పటడుగులు సరిచేసుకుంటే తిరుగుండదు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top