Translate

  • Latest News

    28, మే 2020, గురువారం

    మాక్కొంచెం నమ్మకమివ్వండి...


    మాక్కొంచెం నమ్మకమివ్వండి... ఇది ప్రఖ్యాత రచయిత  ఆలూరి బైరాగి కవితా సంపుటి శీర్షిక అనుకుంటున్నారా... కాదు బాబు గారూ... 38 ఏళ్లుగా మీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల ఆత్మ ఘోష...  వ్యక్తులు శాశ్వతం కాదు... పార్టీ శాశ్వతం... ఈ పార్టీని 1982 మార్చి 29 న అన్నగారు ఎన్ టీ రామారావు గారు స్థాపించారు. తెలుగువాడి ఆత్మ గౌరవం ప్రాతిపదికగా పుట్టిన ఈ పార్టీ లో అప్పటినుంచి పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ పార్టీలోనే కొనసాగుతున్నాం. అన్న గారి సారధ్యంలో కోట్లాది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా వెలుగొందిన పార్టీ... స్థాపించిన 9  నెలల్లోనే అన్నగారి అవిశ్రాంత చైతన్య రధ యాత్రతో అధికార పీఠం అధిష్టించింది. యావత్ భారత దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రోజు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడు 1983 జనవరి 7 న  ఈనాడు పేపర్ లో తెలుగుదేశం సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెడితే... ఈనాడోడు భలే పెట్టాడురా అని ఎంత సంబరపడ్డామో... ఆ తర్వాత ఏడాదిన్నరకే నాదెండ్ల కుట్ర తో ఏర్పడ్డ సంక్షోభంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని అన్న గారు పిలుపిస్తే అందరం రోడ్ల మీదకు వచ్చి పార్టీని కాపాడుకున్నాము. క్రమేణా ఒకే సామాజికవర్గ పార్టీగా ముద్ర పడి 1989  ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. అయితే కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మారదు కదా... మళ్ళీ ఐదేళ్లలో ముగ్గురు ముఖ్య మంత్రులను మార్చారు.. మళ్ళీ 1994 లో రెండోసారి కోట్ల విజయ భాస్కర రెడ్డి  బంగారు పళ్లెంలో గెలుపును తెలుగుదేశం కు కట్టబెట్టారు. అయితే ఏమి జరిగిందో... ఏమో గాని... అన్న గారు లక్ష్మీ పార్వతి ని పెళ్లి చేసుకోవడం... ఆ తదనంతర పరిణామాలు... అందరకూ తెలిసినవే... పార్టీని పరిరక్షించుకోవాలంటే చంద్ర బాబును సపోర్ట్ చేయాలనీ ఈనాడు చెబితే మేము నమ్ముకున్న పార్టీ కోసం మీ వెనుక నడిచాం.. (ఎందుకంటే వ్యక్తులు కాదు... పార్టీ ముఖ్యం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వాళ్ళం కాబట్టి.. ఈ రోజు మీరు ఉండొచ్చు... రేపు ఇంకొకరు ఉండొచ్చు.. వ్యక్తుల తోనే  పార్టీ అంతం అవ్వకూడదు కదా... ) అప్పటి నుంచి గత పాతికేళ్లుగా మీ వెనుకే ఉన్నాం.. మధ్యలో 2004 నుంచి 2014 దాకా మీరు అధికారంలో లేకపోయినా... మీరు ఎలాగోలా చక్రం తిప్పేస్తారు అని మీ మీద ఉన్న ప్రగాఢ నమ్మకంతో మిమ్మల్నే అంటి పెట్టుకున్నాం... 2014 ఎన్నికల ముందు మీరు నేను మారాను... నన్ను నమ్మండి... అంటే మేమూ... మాతో పాటు జనం కూడా నమ్మి మిమ్మల్ని గెలిపించారు. పైగా విడిపోయిన రాష్టాన్ని మీరయితేనే బాగా అభివృద్ధి చేయగలరని అందరం విశ్వసించాము. కానీ ఈ సారి మీరు గెలిచినప్పటినుంచి పార్టీ ఎం.ఎల్.ఏ లు, నాయకులను మీరు ఎలాగైనా సంపాదించుకోండి... మళ్ళీ ఎన్నికల్లో ఆ డబ్బులతోనే మళ్ళీ గెలవాలి అంటూ అవినీతికి గేట్లు ఎత్తేశారు. మీరు జనాలను నమ్ముకోవడం మాని... డబ్బును నమ్ముకున్నారు.. దాంతో జనం మీకు దూరం అయ్యారు...
    ఏడాది తర్వాత ఇప్పుడు మీరు జరుపుతున్న మహానాడు లో అయినా జరిగిన తప్పులపై ఆత్మ విమర్శ ఏమైనా జరుగుతుందేమోనని ఆశ పడ్డాను. కానీ షరా మామూలే... పార్టీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మర్చిపోండి... పొరపాట్లు మళ్ళీ  జరగకుండా చూసుకుంటాను అని అన్నారే కానీ... చేసిన తప్పులకు పశ్చాత్తాపం అనేది ఎక్కడా కనిపించలేదు. ఇలాగయితే మేము పార్టీ కార్యకర్తలం కాబట్టి మీరు చెప్పినదానికి అయిష్టంగానైనా తలలు ఊపి వస్తాం... కానీ జనం మిమ్మల్ని ఎలా నమ్మేది... మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు జనంలో పార్టీ పట్ల విశ్వాసం ఎలా పాదుగొల్పేది... అందుకే... మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు బాబు గారూ... దయచేసి.. మాక్కొంచెం నమ్మకమివ్వండి... 
    ఇట్లు 
    ఒక తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మాక్కొంచెం నమ్మకమివ్వండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top