Translate

  • Latest News

    2, జూన్ 2020, మంగళవారం

    అమెరికా ఉద్యమ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం



    అమెరికా.ది గ్రేట్... అమెరికా . గొప్ప దేశం... అమెరికన్లు గొప్పోళ్ళు... మన వాళ్ళు వొట్టి వెధవాయలోయ్... అని మనోళ్లంతా అంటూ ఉంటారు... అలాంటి మాటలు విన్నప్పుడల్లా మా చెడ్డ చిరాకు వచ్చేది... కానీ ఇప్పుడు అనిపిస్తోంది ... అమెరికా.ది గ్రేట్... అమెరికా . గొప్ప దేశం... అమెరికన్లు గొప్పోళ్ళు...ఎందుకంటే... ఒక నల్ల జాతీయుడిని చంపినందుకు మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న నల్ల జాతీయులంతా ఏకమై పోయారు.. అమెరికాలో 140 నగరాల్లో నిరసనలు, ఆందోళనలు, లూటీలు, దహన కాండ జరుగుతోంది. సంఘటన జరిగి వారం దాటినా నేటికీ 40 నగరాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. సంఘటన జరిగిన మినియా పొలిస్ నగరంతో పాటు న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, డల్లాస్, కాలిఫోర్నియా,  ఫిలడెల్ఫియా, మియామి, అట్లాంటా తదితర నగరాల్లో సైతం పెద్దపెట్టున ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికన్లు నిజంగానే గొప్పోళ్ళురా భాయ్
    ఇంతకూ జార్జి ఫ్లూయిడ్ చేసిన నేరం ఏమిటి... ఒక 20 డాలర్ల నకిలీ నోటును చెలామణి చేయడం... అదీ ఎందుకు చేశాడా పని. కరోనా మహమ్మారి పుణ్యమా అని లాక్ డౌన్ కారణంగా తాను పనిచేస్తున్న రెస్టారెంట్ లో  ఉద్యోగం పోయి... ఆర్ధిక బాధలతో ఇబ్బందిపడుతూ పూట గడవని పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడ్డాడు. అయితే ఆ నేరానికి కోర్టులు శిక్ష విధించాలి గాని. నడి రోడ్డుపై పోలీసు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రాణాలు తీస్తాడా... అదీ.. ఎంత దారుణం అంటే... జార్జి ని రోడ్డు మీద కిందపడేసి.. అతని మెడపై ఆ పొలిసు తన మోకాలిని అదిమిపట్టే బలంగా 8 నిమిషాల 46 సెకన్ల పాటు తొక్కి పెట్టాడు. దాంతో ఊపిరాడక జార్జి చనిపోయాడు. ఈ దృశ్యాన్ని వీడీయో లో చూసిన నల్లజాతీయుల్లో ఆవేశం ఉప్పొంగింది. కేవలం ఒక నల్ల జాతీయుడనే కదా అంత క్రూరంగా వ్యవహరించారు... అదే నేరం ఒక తెల్ల జాతీయుడు చేస్తే ఆలా చేస్తారా అని జాతి వివక్ష పై భగ్గుమన్నారు. వారి దెబ్బకు భయపడి ట్రంప్ బంకర్లో తలదాచుకున్నాడు.
    మరి  అన్నిట్లోనూ అమెరికాను ఆదర్శంగా తీసుకునే మన వాళ్ళు  ఇలాంటి చైతన్యం విషయంలో ఎందుకు ఆదర్శంగా తీసుకోరు.. దేశంలో అణగారిన వర్గాల మీద... వాటిని ప్రశ్నించే వర్గాల మీద ప్రభుత్వ దమనకాండను ఎందుకు నిలదీయరు...వలస కార్మికులు వందల మైళ్ళు నడిచి..నడిచి...నడవలేక దారిలోనే ఎంతోమంది మరణించినా పాలకులు ఒక్క సానుభూతి వాక్యంతో సరిపెడతారు... కవులు  కవితలు, పాటలు రాసి పాడుకుంటారు... కానీ జనాన్ని సమీకరించి రోడ్డెక్కరు.. మేధావులు  ప్రకటనలతో సరిపెడతారు  తప్ప బలమైన ఆందోళనకు రూపకల్పన చేయరు...  ఎక్కడ ఉంది లోపం... మనలోనే ఉంది. మన వ్యవస్థ లోనే ఉంది. ఇక్కడ ఆ విధంగా ఒక జాతి కింద, ఒక వర్గం కింద సమీకరణ జరగడం లేదు. ఆలా సమీకరణ జరిగితే ఎక్కడ తమ పీఠం కదులుతుందోనని, ముందుగానే కులాలు, మతాల పేరిట పాలకులు ముందరి కాళ్లకు బంధం వేశారు. మన దేశంలో ఎప్పుడైతే కులాలు, మతాల కతీతంగా ఒక సమస్యపై  పీడితులంతా ఏకం అవుతారో అప్పుడే నిజమైన విప్లవం వస్తుంది. ఇప్పటికయినా అమెరికాలో నల్ల జాతీయులను చూసైనా బుద్ధి తెచ్చుకుందాం.. ప్రశ్నించడం అలవాటు చేసుకుందాం. ఉద్యమ స్ఫూర్తి ని ఆవాహన  చేసుకుందాం.  అది మన కనీస కర్తవ్యం అని గుర్తిద్దాం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అమెరికా ఉద్యమ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top