Translate

  • Latest News

    20, జూన్ 2020, శనివారం

    గ్రాడ్యుయేట్ మలాలా...


    గ్రాడ్యుయేట్ మలాలా... అయితే ఏమిటీ అనుకుంటున్నారా... ఒక యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే అది వార్త కాదు కానీ... మలాలా  గ్రాడ్యుయేట్ అయితే మాత్రం అది నిజంగా ప్రపంచంలో ఆడపిల్లలందరికి పండుగే... ఎందుకంటే... ఆమె చదువు కోసం ప్రాణాల్ని పణం గా పెట్టింది కాబట్టి. మనం సాధారణంగా అంటూ ఉంటాం... సంగీతం వినడం  కోసం... లేదా పాటల కోసం చెవులు కోసుకుంటాం... కానీ నిజంగా ఎవరూ చెవులు కోసుకోరు...అదొక ఉపమాన అలంకారం.... కానీ మలాలా తాను, తనతో పాటు తోటి ఆడ పిల్లలు అందరూ చదువు కోవడం కోసం తన ప్రాణాలనే పణం గా పెట్టింది. చదువుకునే హక్కు కోసం నినదించింది. దానికి తోడు స్వాత్ లోయలో ఆడ పిల్లల చదువుకునే హక్కును కాలరాస్తున్న తాలిబన్లపై బి.బి.సి కి మలాలా డైరీ పేరుతో  తన భావాలను గుదిగుచ్చి రాయగా బి.బి.సి వాటిని వరుసగా ప్రసారం చేసింది. అది తాలిబన్లకు ఆగ్రహాన్ని కలిగించింది... ఈ నేపథ్యంలోనే 2012 అక్టోబర్ 9 న తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మలాలా  బ్రిటన్ లోని క్వీన్ ఎలిజిబెత్ ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి గెలిచింది. చదువుకునే హక్కు కోసం ప్రాణాన్ని పణం గా పెట్టిన మలాలా కు అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతే కాదు ఐక్యరాజ్య సమితి లో మలాలా ప్రసంగం అద్భుతం...  అంత  చిన్న వయసులో ఎంత పరిణితిగా మాట్లాడిందో... నేను ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడకు రాలేదు... ఈ ప్రపంచంలో ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు కోసం ఇక్కడ నిలబడ్డాను. అని ప్రకటించింది. ఆ తర్వాత తన అనుభవాలతో ఐ యామ్ మలాలా (నేను మలాలా ) పేరుతో పుస్తకం రాసింది. అది ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లోకి అనువాదం అయింది. మలాలా అంటే అర్ధం బాధాసర్పద్రష్ట... మలాలా నాన్న కవి. అందుకే తన కూతురికి కవయిత్రి, పోరాట యోధురాలు మెయివాండ్ మలాలా పేరులోని మలాలా  అని పేరు పెట్టారు. మలాలా ఇప్పుడు ప్రఖ్యాత ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇది నిజంగా ప్రపంచంలో ఆడ పిల్లలందరికి గొప్ప పండుగ లాంటి శుభ వార్తే... 
    • Blogger Comments
    • Facebook Comments

    2 comments:

    Item Reviewed: గ్రాడ్యుయేట్ మలాలా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top