Translate

  • Latest News

    9, జులై 2020, గురువారం

    పాఠాల తొలగింపులోనూ రాజకీయమే...


    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో వచ్చిన ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతురాలవుతోంది.  జిత్తుల మారి ఎత్తులు వేయడంలో సుప్రసిద్ధులైన మోడీ,షా ల ద్వయం నేతృత్వంలో ఈ అరాచక ప్రక్రియ దేశంలో నిరాఘాటంగా సాగిపోతోంది. సంక్షోభాలను సువర్ణావకాశాలుగా మలుచుకుంటోంది. ఇందుకు వారిని అభినందించాల్సిందే... ఎందుకంటే... గత ఆరేళ్లుగా తెర ముందు హీరోలు మోడీ, షా లు అయినా   తెర  వెనుక ఉండి నడిపిస్తున్న మనువాద విష కుంభం ఆర్.ఎస్.ఎస్ ఒక పధకం ప్రకారం తన వర్గ శత్రు నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తూ వచ్చింది. ఇందులో భాగమే దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ హత్యలు. ఎందుకంటే మనువాద సిద్ధాంతానికి ప్రధాన శత్రువులు హేతువాదులే... అందుకే ఆర్.ఎస్.ఎస్.. వీరిపై గురి పెట్టింది. రాజకీయ శత్రువులు వారికి పెద్ద లెక్క కాదు. ఎందుకంటే వారి దగ్గర దేశ భక్తి అనే ఒక పాశుపతాస్త్రం ఉంది. దానికి తోడు హిందూయిజం అనే ఒక ఆగ్నేయాస్త్రం ఉంది. ఆ రెండు అస్త్రాలు చాలు  రాజకీయ శత్రువులందరినీ పాతాళానికి తొక్కేయడానికి... హేతువాదులను దిగ్విజయంగా  తుదముట్టించిన హిందుత్వ శక్తులు అర్బన్ నక్సల్స్ పేరుతొ సాయిబాబా  వరవరరావు, సుధా భరద్వాజ్ వంటి  ప్రొఫెసర్లను, సోషల్ యాక్టీవిస్టులను  అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారు జీవితాంతం జైళ్ల లోనే మగ్గిపోయి... చివరకు జైలు లోనే తుది శ్వాస విడిచేలా చేసేలా ప్లాన్ చేసి దిగ్విజయంగా అమలు చేస్తోంది.
     కరోనా వచ్చి కమలం కుట్రలు అన్నిటినీ వెనక్కు నెట్టేసింది. దేశ ప్రజలందరినీ ఇంకా వేరే సమస్యల గురించి కనీసం ఆలోచించనీయకుండా కట్టిపడేసింది. కరోనా కూడా ఆ విధంగా పాలకులకే కలసివచ్చింది. పీడితుల పాలిటి విలన్ గా మారింది. బి.జె.పీ ప్రభుత్వం ఏదో ఉద్ధరించేస్తున్నట్టు ఫోజు పెట్టి... ఐదు రోజుల సీరియల్ డ్రామా ప్రసారం చేసి... నిర్మలమ్మతో 20 లక్షల  కోట్ల ప్యాకేజి అనే రాజు గారి దేవతా వస్త్రాల నాటకం బహు రంజుగా రక్తి కట్టించింది. కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేని తప్పుడు నిర్ణయం అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటన తో లక్షలాది మంది వలస కూలీలు  రోడ్డున పడ్డారు. వందలాది మంది నడి రోడ్డు మీదే ప్రాణాలు వదిలారు. అయినా ఈ ప్రభుత్వం వారి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండడం కోసం... సమయాన్ని కుదించి... దాంతో పాటు పాఠ్యఅంశాలను  కుదించాలని నిర్ణయం తీసుకుంది.. ఇది సమంజసమే అయినా... ఆ తీసివేసిన పాఠాల పైనే అభ్యంతరం... కేంద్రం చాలా తెలివిగా తనకు వ్యతిరేకమైన అంశాలను పక్కన పెట్టింది.  9 నుంచి 12 తరగతుల వారికి సి.బి.ఎస్.ఈ 30 శాతం పాఠాలు తొలగించింది. ఇంతకూ సి.బి.ఎస్.ఈ తొలగించిన పాఠాలు ఏమిటంటే...  పదో తరగతి వారికి ప్రజాస్వామ్యం- వైవిధ్యత, లింగం, కుల మతాలు , ప్రజాస్వామ్యంలో  ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. ఇక 11 వ తరగతిలో సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయ వాదం, భారత దేశంలో  స్థానిక ప్రభుత్వాలు, లౌకిక  వాదం అనే అంశాలను తొలగించారు. 12 వ తరగతిలో పెద్ద నోట్ల రద్దు, భారత దేశంలో సామాజిక ఉద్యమాలు, భారత దేశ ఆర్ధిక అభివృద్ధి అంశాలను తొలగించారు. చూశారా.. పాఠాల తొలగింపులో కూడా బి.జె.పీ ఎంత చాకచక్యంగా వ్యవహరించిందో గమనించారా... తనకు వ్యతిరేకమైన భావజాలం లేకుండా ఎలా జాగ్రత్త పడిందో చూశారుగా... ఆదండి సంగతి... విద్యను కాషాయీకరణ చెసే పధకంలో భాగమే ఇది... అయితే తొలగించిన సిలబస్ ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే అని సి.బి.ఎస్.ఈ ప్రకటించింది. కానీ ఏమో... భవిష్యత్తులో ఈ తొలగించిన సిలబస్ స్థానే కొత్త సిలబస్ తయారుచేయించి.. వీటి స్థానే వాటిని పెట్టె ప్రమాదం లేకపోలేదు సుమా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పాఠాల తొలగింపులోనూ రాజకీయమే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top