Translate

  • Latest News

    16, ఆగస్టు 2020, ఆదివారం

    ఏపీలో మొదలైన బి.జె.పీ విన్నింగ్ ప్లాన్


    ఏపీలో  బి.జె.పీ విన్నింగ్ ప్లాన్ మొదలయింది. బి.జె.పీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా ఐదేళ్లు ముందుగానే అందుకు ప్రణాళిక రచిస్తుంది. దానిని పక్కాగా అమలు చేయడానికి ఆర్.ఎస్.ఎస్ దళం సిద్ధంగా ఉంటుంది. గతంలో ఉత్తరప్రదేశ్ లో గాని, కరడు గట్టిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మట్టి కురిపించిన త్రిపురలో గాని అలాగే చేసారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై కన్నేశారు. కర్ణాటకలో ఎలాగో బి.జె.పీ ప్రభుత్వమే ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కేరళను పక్కన పెడితే మిగిలిన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై చూపు మరల్చింది. ముందుగా తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలోనే అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ లోగానే బెంగళూర్ లో జైలులో ఉన్న  శశికళను విడిపించి తమిళనాడులో 2021 మేలో జరిగే  ఎన్నికల్లో బి.జె.పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టి రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి తోడు పళని స్వామి, పన్నీర్ సెల్వం ల మధ్య వచ్చే ఎన్నికలలో  ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనే చిచ్చు పెట్టింది. ఆటోమాటిక్ గా అక్కడ పరాభవం పొందిన వర్గాన్ని శశికళ ద్వారా బి.జె.పే ఆకర్షించే  అవకాశం ఉంది. ఇక  తెలంగాణలో బి.జె.పీ కి అల్ రెడీ కొంత పట్టు ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి అక్కడ నలుగురు ఎం.పీ లు, ఒక ఎం.ఎల్.ఏ ఉన్నారు... వచ్చే ఎన్నికల నాటికి వ్యూహాలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల ద్వారా రచిస్తోంది.
    ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ జగన్ వివిధ సంక్షేమ పధకాల ద్వారా  ఈ 14 నెలల కాలంలోనే ప్రజలకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలోకి నేరుగా అందించాడు. నవరత్నాలతో జగన్ పేద ప్రజలకు బాగా దగ్గర అయిపోయాడు. ఈ సమయంలో జగన్ కు వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా ప్రజలు రిసీవ్ చేసుకోరు కాబట్టి... ముందు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ను దెబ్బకొట్టి ఆ స్థానములో చొరబడితే... వచ్చే ఎన్నికల నాటికి జగన్ తో ఢీకొట్టి అధికారం చేపట్టాలని పధకం రచించింది. ఇందుకు అనుగుణంగా పావులు కదపడం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ లో విజయవంతంగా అమలు చేసిన సామాజిక సమీకరణ సూత్రాన్నే ఇక్కడా  అమలు చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, రెడ్డి లు చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మూడో ప్రధాన సామాజిక వర్గమైన కాపు వర్గాన్ని బుట్టలో వేసుకోవడానికి సోము వీర్రాజును అధ్యక్షుడిని చేయడంతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆల్ రెడీ తన గంపలో ఎప్పుడో కప్పెట్టుకుంది. ఇప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవిని అధికారికంగా బి.జె.పీ లో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ విధంగా కాపు సామాజిక వర్గంతో పాటు అయోధ్య రాముని జపంతో రాష్ట్రంలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు, వారితో పాటు మొదటి నుంచి ఆర్.ఎస్.ఎస్ కు దగ్గరగా ఉంటూ వచ్చిన కొన్ని బి.సి సామాజిక వర్గాలోకి కూడా చొచ్చుకుపోవడానికి పధకాలు రచిస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గంలో మేధావులుగా చెలామణి అవుతున్న కొందరిని ఆకట్టుకుని.. వారి ద్వారా బి.జె.పీ అనుకూల వ్యాసాలను పత్రికల్లో రాయించి. ఆ వర్గాల్లో కూడా పాదం మోపడానికి బి.జె.పీ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇటీవల ఒక ప్రముఖ దళిత మేధావి, రచయిత  మోడీని సమర్ధిస్తూ రాసిన వ్యాసం ఆ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది. ఆ వ్యాసం చదివిన దళిత మేధావులంతా ఈయన ఇలా రాయడం ఏమిటి అంటూ నోరెళ్లబెట్టారు... అయితే మేధావుల్లారా... ఆశ్చర్య పోవద్దు... వచ్చే నాలుగేళ్లలో ఇలా నోరెళ్లబెట్టాల్సిన విషయాలు ముందు ముందు చాలా చాలా జరుగుతాయి. మరెందరో మేధావులు కమలం గంప కిందకు చేరుతారు. మోడీ, అమిత్ షా పక్కా ప్లాన్ వేశారంటే అంతే మరి. అయితే ఎంత చేసినా బి.జె.పీ 2024 కి ఏపీ లో అధికారంలోకి రాకపోవచ్చు కానీ. ప్రధాన ప్రతిపక్షం కావడం మాత్రం  ఖాయం అని చెప్పవచ్చు. 
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: ఏపీలో మొదలైన బి.జె.పీ విన్నింగ్ ప్లాన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top