Translate

  • Latest News

    13, సెప్టెంబర్ 2017, బుధవారం

    అకాశమంత అభ్యుదయం ,సముద్రమంత లోతైన ప్రేమ .... ఆచార్య ఆత్రేయ

                             
    ఆకాశమంత అభ్యుదయం ,సముద్రమంత లోతైన ప్రేమ రెండు ఒకే మనిషి లో ఉంటే అతను “శ్రీ కిళాంబి వెంకట నరసింహాచార్యులు” అవుతాడు . ఇతను ఎవరో అనుకుంటున్నారా  .... ఆచార్య ఆత్రేయ”గా పేరుగాంచిన  మనందరికీ “మనసు కవి”గా “మన సుకవి”గా సుపరిచితులే.   ఈ రోజు ఆచార్య ఆత్రేయ వర్ధంతి ..   ఈయన గురించి తెలియని తెలుగు వాడుండడు. 
    ఆత్రేయ గురించి ఏమన్నా చెప్పాలి అంటే, తెలుగులో వేరే మాటలు, పదాలు లేవు, వారు వాడిన పదాలతోనే, వారి మాటలతోనే, వారి పాటలతోనే వారి గురించి చెప్పాలి. వేరే మార్గం లేదు.

    “ముద్ద బంతి పూవులొ, మూగ కళ్ళ ఊసులూ,… బాసలూ” చెప్పాలన్నా? “ఈనాడే ఎదో అయ్యింది… అందాల లోకం రమ్మంది” అని ప్రేయసీ ప్రియులని ఉక్కిరిబిక్కిరి చెయాలన్నా? “మూగ మనసు” యొక్క భాష చెప్పాలన్నా? “మంచు కురిసే వేళలో మల్లె విరిసే దెందుకో” ఆలోచన చేయాలన్నా?
    “మధ్యతరగతి జీవుల బతుకు బండి” గూర్చి చెప్పాలన్నా? “విశ్వజనీన సమస్యలు” వెలికి తీయలన్నా? అది కేవలం ఆత్రేయకు మాత్రమే సాధ్యమైనది.

    “రాక రాక వొచ్చావు చందమామ” అంటూ చల్లని తేనెలూరు తెలుగు పాటని చిత్ర రంగానికి పరిచయం చేసి. “తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా” అంటూ తెలుగు పాటల్లోని, తెలుగు దనాన్ని తెలుగు వారికి అందించి, “ఆడుతూ పడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది” అంటూ పాటలు పాడుతూ పనిచేస్తూ ఉంటే ఆ మధురిమ ఎలా ఉంటుందో వివరించారు. అలాగే “శిలలపై శిల్పాలు చేక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు” అంటూ తెలుగు చలన చిత్ర ప్రపంచానికే తలమాణికమైన అత్యద్భుతమైన పాటలను అందించారు.

    ప్రియుడి చేత “ప్రియతమా నా హృదయమా” అంటూ ప్రేయసే ప్రియుడి హృదయమనిపించినా, “ఎదుటా నీవె ఎదలోనా నీవె” అంటూ ప్రేయసి తన గుండెలోతుల్లోనే ఉందనిపించినా, “సిరి మల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు” అని ప్రియురాలి ఆనందాన్ని కోరుకున్నా, ఆనంద పారవశ్యంతో ఉన్న అదే ప్రియుడి చేత “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం” ప్రియురాలి కఠినత్వాన్ని ఎత్తిచూపినా, “ప్రేమ లేదని ప్రేమించ రాదనీ” అని భగ్న ప్రేమను చూపినా, అది కేవలం ఆత్రేయకే చెల్లుతుంది. మనసెరిగిన “మన‘సు’కవి” కే చెల్లుతుంది.

    అలాగే, “సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్” అంటూ పొట్ట చేత పట్టుకొని నగరాలకు వొచ్చిన నిరుద్యోగ యువతకు చేయూతనిస్తూ “పోరా బాబు పోరా, ఎలుకోరా నీ గమ్యం చేరుకోరా” వారిని ప్రోత్సహించారు.

    మరోచోట, “ముద్ద బంతి పువ్వులో” దాగి ఉన్న ఊహల్ని వెలికి తీసి, “నువ్వు లేక వీణ పలుకలేనన్నది” అంటూ తెలుగు సినీ ప్రపంచాన్ని ఉహలోకంలో విహరింప చేశారు.

    అంతే కాదు, “నీ సుఖమే నే కోరు కున్నా” అంటూ తెలుగు సాహితీ ప్రియుల సుఖాన్ని కాంక్షించారు. “తెల్ల చీర కట్టు కున్నది ఎవరి కోసము” అంటూ కొంటె ప్రశ్న వేసి, అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించి, “కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వేర్రిక్కి ఉన్నోళ్ళు” అని అంటూ, “వేళా పాళ లేదు ఈ కుర్రాళ్ళాటకు” అంటూ చమత్కరించారు.

    అంతే కాక, “కన్నులు కన్నులతో కలబడితే” ఏమౌతుంది అని సూటి ప్రశ్న సంధించి “కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు” అంటూ “నా మాటే నీ మాటై చదవాలి” అని అంటూ “పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో” మాట లేక పొతేనేమి “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అన్నారు ఈ విధంగా మనసులో పలికే మాటలు మనసెరిగిన “మన ‘సు’ కవి” కి తప్ప మరెవ్వరికి కుదురుతుంది?

    అంతే కాక, “మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే” అంటూ మనసు మనిషికి మధ్య జరిగే ఘర్షణను ఈ మనోహరమైన కావ్యంద్వారా వెలిబుచ్చారు.

    “భారత మాతకు జేజేలు” అంటూ దేశ భక్తిని కూడా చాటి చెప్పారు.

    “ఉన్నావా అసలున్నావా? ఉంటే! కళ్ళు మూసుకున్నావా?” అంటూ దైవాన్ని నిలదీసిన ఘనత ఆత్రేయదే? మరి ఇంతలోనే ఆ స్వామి సాక్షాత్కారము లభించిందేమో “శేషశైల వాస శ్రీ వేంకటేశ” అంటూ తన దైవ భక్తి తత్పరతఃను చాటి చెప్పారు.

    ఆత్రేయ తమ రచనల ద్వారా, పాటల ద్వారా, కవితల ద్వారా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొని, 1989లో సినీ ప్రేమికుల నుంచి, సాహితీ ప్రియుల నుంచి శాస్వితంగా సెలవు తీసుకున్నారు.  ఆచార్య ఆత్రేయ వర్ధంతి  ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ.. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అకాశమంత అభ్యుదయం ,సముద్రమంత లోతైన ప్రేమ .... ఆచార్య ఆత్రేయ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top