గుండె జబ్బులు దగ్గరకు
రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను ఒంటాపట్టించుకోవాలి. పిల్లలకు చిన్నతనం
నుంచే సరైన అలవాట్లు నేర్పించాలి. మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ
తీసుకోవాలి. స్త్రీ చేతులలోనే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. అటువంటి
స్త్రీ తన ఆరోగ్యంపై జాగ్రత్త వహించకపోతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది.
అందుకే ప్రతి మహిళా గుండె జబ్బులపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
అంచనా ప్రకారం భారతదేశంలో 2020 నాటికి గుండె జబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గుండె
జబ్బులు ఎంత వేగంగా విస్తరిస్తున్నా యో తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. గుండె
జబ్బులను ఎవరికి వారు చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అవగాహన లేమి వల్ల
గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
.
భావి తరానికి పునాది
బాల్యంలో అలవరచుకున్న
అలవాట్లు జీవితాంతం ఉంటాయి. అవి ఆహారపు అలవాట్లే కావచ్చు లేక మరేమైనా కావచ్చు.
అందుకే చిన్నతనంలోనే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పించడం, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడం ద్వారా
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. కొందరు పిల్లలే మో పోషకాహార లోపంతో
బాధపడుతున్నారు. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతోంది. మరికొందరు
ఆర్థికంగా బాగున్న వారు ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం పట్ల ఎక్కువ ఆసక్తి
చూపుతున్నారు. పిజ్జాలు, జంక్ ఫుడ్స్,
చిప్స్ వంటివి నిత్యం వారి మెనూలో ఉంటున్నాయి.
ఈ అలవాట్లు కూడా గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. పిల్లలు ఆటలు ఆడటం
తక్కువైపోయింది. చాలా వరకు స్కూల్స్‌లోప్లే గ్రౌండ్ ఉండటం లేదు. ఫలితంగా శారీరక
వ్యాయామం లేకుండా పోతోంది. అందుకే పిల్లల్లో అధిక బరువు సమస్య పెరిగిపోతోంది.
యవ్వన దశ చాలా కీలకం. ఈ వయసులోనే దేనికైనా తొందరగా అలవాటు పడిపోతారు.
స్మోకింగ్ కూడా అదే
కోవలోకి వస్తుంది. ఫ్యాషన్‌గా ప్రారంభమైన ఈ అలవాటు మానుకోలేని స్థితికి వస్తుంది.
పొగతాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాతికేళ్ల వయసులోనే
గుండెపోటు రావడానికి కారణం ధూమపానమే.
ఏం చేయాలి?
పిల్లలకు ఆరోగ్యకరమైన
ఆహారపు అలవాట్లను నేర్పాలి. నూనె పదార్థాలు, పిజ్జాలు, బర్గర్‌లు,
చిప్స్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.
వాటివల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పాలి. ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.
స్త్రీలకు అవగాహన అవసరం
ప్రస్తుతం పురుషులతో
సమానంగా స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.
దాంతోపాటు కుటుంబపరమైన ఒత్తిడి ఉంటోంది. వంట చేయడం, పిల్లలను రెడీ చేసి స్కూల్‌కి పంపించడం, తను రెడీ అయి ఆఫీస్‌కు వెళ్లడం వంటి పనులతో బిజీ జీవనం
గడుపుతున్నారు. ఇది వారిపై తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తోంది. ఫలితంగా గుండె జబ్బులు
వచ్చే అవకాశం పెరుగుతోంది. స్త్రీలలో 30 శాతం మంది గుండె జబ్బుల మూలంగానే చనిపోతున్నారు. పురుషులతో పోల్చితే స్త్రీలు
హార్ట్ఎటాక్ తరువాత కోలుకునే అవకాశాలు కూడా తక్కువగానే ఉఉంటాయి. గుండె జబ్బుల పట్ల
స్త్రీలకు అవగాహన పెంచితే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి?
ప్రతి స్త్రీ బరువును
నియంత్రణలో ఉంచుకోవాలి. బీపీ, షుగర్ పరీక్షలు
చేయించుకోవాలి. బీపీ ఉన్నట్లయితే మందులు వాడటం, షుగర్ ఉన్నట్లయితే మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవడం చేయాలి.
వంశపారంపర్యంగా గుండె జబ్బులు వస్తున్నట్లయితే మరింత ఎక్కువ జాగ్రత్తలు
తీసుకోవాలి. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు ఏమైనా కనిపిస్తే
వైద్యపరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలి. గుండె జబ్బులు వచ్చిన
తరువాత బాధపడే కన్నా రాకుండా మంచి ఆహారపు అలవాట్లను పాటించడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదని
గుర్తుంచుకోవాలి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి