తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ నటుడు కమలహాసన్ పార్టీ ఏర్పాటుకు ముమ్మరరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దసరా లేదంటే గాంధీ జయంతి రోజున తన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే నవంబరులో జరగనున్న తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 4వేల మంది అభ్యర్థులను కమల్ బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. డీఎంకేతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో కమల్ ఉన్నట్టు సమాచారం. అభిమానులతో సమావేశం అయ్యేందుకు కమల్ ప్రణాళిక సిద్ధం చేశారు. క్రమశిక్షణ, మంచి పేరున్న అభిమానులకు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ ఇటీవలే కేరళ సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తమిళ రాజకీయాలపై కమల్ కొద్ది కాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ అన్నాడీఎంకేతోపాటు ఇతర రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎంకే ఇంటి పత్రిక మురసోలి 75ఏళ్ల వార్షికోత్సవంలోనూ పాల్గొన్నారు. జీఎస్టీ లాంటి అంశాలతోపాటు ఇటీవల నీట్ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత మృతిపై తనదైన స్టైల్లో స్పందించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ తర్వాత వామపక్ష పార్టీ నాయకులే అసలైన హీరోలంటూ కమల్ ప్రశంసించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. రజనీ రాజకీయ అరేంగేట్రం నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో వేడిరగులుతోంది. ఇప్పుడు కమల్ హాసన్ కూడా తోడవ్వడంతో రాజకీయం రంజుగా సాగుతోంది. రజనీ కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు ఇప్పటికే సాగుతున్నాయి. అయితే ఆయన నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. ఈ విషయం పై భిన్నస్వరం లో రజని నాన్చుడు... కమల్ దూకుడు అనే అంశం పై గతంలోనే పోస్టింగ్ వచ్చిన విషయం విదితమే కానీ కమల్ అలాకాదని తెలుస్తోంది. కమల్ కొత్త పార్టీ కోసం వేగంగా సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారాలు ఊపందుకున్నాయి. అతి త్వరలోనే కమిల్ పార్టీ పెడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అన్నీ కుదిరితే ఈ నెలాఖరులోనే కొత్త పార్టీకి కమల్ శ్రీకారం చట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. విజయదశమి పర్వదినం రోజున, లేదా గాంధీ జయంతి రోజున ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ రెండింటిలో ఏదో ఒక రోజున కమల్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి