Translate

  • Latest News

    17, అక్టోబర్ 2017, మంగళవారం

    వైకాపా బీసీ జపం. ..బీసీల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు


    వైకాపా అధినేత జగన్ బీసీ జపం మొదలు పెట్టారు. గత మూడున్నర దశాబ్దాలుగా అత్యధిక మంది బీసీ ఓటర్లు తెలుగుదేశం వైపు ఉన్న తరుణంలో ఆయా వర్గాల్లో ఉన్నఅసంతృప్తిని వైకాపా తన వైపు మరల్చుకొనే ప్రయత్నం ఇప్పటికైనా జరపటం మంచిదే. టిడిపి ఆవిర్భావం నుంచి బీసీలు టిడిపిలోనే కొనసాగారు. వారిని తమ వైపు తిప్పకోవటంలో అటు కాంగ్రెస్పార్టీ కాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి వైఫల్యం చెందాయి. కనీసం వారిని తమ వైపు ఆకర్షించే ప్రయత్నం కూడా చేయలేదు.
    సార్వత్రిక ఎన్నికలు మొదలు కావటానికి కొంత సమయమే మిగిలి ఉండటంతో వైకాపాకు బీసీలు గుర్తుకొచ్చారు. పార్టీలో సైతం బీసీలకు సముచిత స్థానం లేదన్న విమర్శలు ఉన్నాయి. బీసీల్లో అత్యధికంగా యాదవ, గౌడ, పద్మశాలి సామాజిక వర్గ ఓట్లు గెలుపును ప్రభావితం చేస్తాయి. ఉత్తరాంద్రలో కొప్పవెలమ, తూర్పుకాపులు, రాయలసీమలో మున్నూరు కాపులు ఇతర ప్రాంతాల్లో బీసీల్లోని ఆయా సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక భాగం ఉన్న బీసీ ఓటర్ల టిడిపికే మద్దతు పలుకుతున్నారు. జగన్ బీసీ జపంతో బీసీల్లో మార్పు వస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వంపై బీసీలో అసంతృప్తి నెలకొని ఉన్నమాట వాస్తవమే. పార్టీ పదవుల్లోగాని, ఇతర నామినేటెడ్ పదవుల్లో గాని బీసీలకు ప్రాధాన్యత కల్పించటంలేదని వారు పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. తెలంగాణాలో యైతే పార్టీ టికెటు పై గెలిచిన బీసీ సంఘ ఉద్యమకారుడు కృష్ణయ్య అయితే పార్టీకి దూరంగా ఉంటూ ఏకంగా పార్టీ అధిష్టానంపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇది ఇలా ఉండగా మరో వైపు కాపల రిజర్వేషన్ విషయంలో కాపులను బీసీలలో చేర్చటానికి జరుగుతున్న ప్రయత్నాలపై కూడా బీసీల్లో అసంతృప్తి నెలకొని ఉంది. గతం కన్నా  టీడిపి కి ప్రత్యామ్నాయం కోసం బీసీలు ఎదురు చూస్తున్నారన్నది ఆ పార్టీలో ఉన్న నాయకులే చెబుతున్న మాట. కాని వారి అసంతృప్తిని సమర్ధవంతంగా వినియోగించుకొని వైకాపా ఎంతవరకు  క్యాష్ చేసుకుంటుందన్నదే సమస్య.  మరో వైపు వైకాపా బీసీ సమావేశం ప్రారంభమౌతున్న సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు వరాల జల్లులు కురిపించటానికి సిద్దమయ్యారు. వైకాపా బీసీల జపం పై ఇప్పటికే మంత్రులు , ప్రజా ప్రతినిధులు విమర్శలు మొదలు పెట్టారు. ఏదీ ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తన సాంప్రదాయ ఓటు బ్యాంకు బీసీల ఓట్లను కాపాడుకోవటానికి టీడీపీ, వారిని ఆకర్షించటానికి వైకాపా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చూద్దాం బీసీ లు ఎటువైపు నిలబడతారో....

     -మానవేంద్ర 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వైకాపా బీసీ జపం. ..బీసీల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top