Translate

  • Latest News

    17, నవంబర్ 2017, శుక్రవారం

    పద్మావతి వివాదాల ప్రయాణం.. అసలు కధేంటి .. ?



    పద్మావతి సినిమా విడుదలకు ముందు వివాదాల చుట్టూ తిరుగుతోంది. సినిమా నిలిపివేయాలని కర్ణిసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే ముక్కు కోసేస్తామని కొందరంటుంటే..మరి కొందరైతే చంపేస్తే రూ.5 కోట్లిస్తామంటూ బహిరంగంగా ప్రకటనలిస్తున్నారు. ఒకవేళ సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పద్మావతి చిత్రాన్ని నిలిపివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమంటూ కేంద్రం చేతులెత్తిసింది. శాంతి భద్రతలు రాష్ట్రాలే చూసుకోవాలని సూచించింది. మేమైతే నటులకు తగినంత భద్రత కల్పిస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకోవైపు భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోలేమంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా తేల్చిచెప్పింది. 
    200కోట్ల బడ్జెట్‌తో ... 
    ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు గత ఏడాది జూలైలో ఆరంభమయ్యాయి. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 200కోట్ల బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు. పద్మావతిగా టైటిల్ రోల్‌ను దీపికాపదుకునే పోషిస్తున్నది. ఈ చిత్రంలో ఢిల్లీసుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్‌సింగ్, పద్మావతి భర్త రావల్త్రన్‌సింగ్‌గా షాహిద్‌కపూర్ నటిస్తున్నారు. 13-14శతాబ్దానికి చెందిన చారిత్రక కథాంశంతో బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో నిర్మాణం నుంచే పద్మావతి అందరిలో ఆసక్తిని పెంచింది.
    ప్రామాణికమైన సమాచారమేది ... ?

    1540లో సూఫీ కవి మాలిక్ మహ్మద్ అవధి భాషలో రాసిన పద్మావత్ అనే పద్యం ప్రేరణతో దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నారని తెలిసింది. రాణి పద్మిని దక్షిణ మధ్య రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్‌కు చెందిన రాజ్‌పుత్ మహారాణి. ఆమె భర్త రావల్త్రన్‌సింగ్. 1303లో అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటపై దండెత్తుతాడు. రాణి పద్మావతి అద్భుత సౌందర్యం గురించి తెలుసుకొని మోహవివశుడై అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటపై దండయాత్ర చేశారని పద్మావత్ పద్యంలో ఉటంకించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రను తిప్పికొట్టడానికి తుది వరకు పోరాడిన రాణి పద్మావతి బలమైన ఢిల్లీసుల్తాన్ సేనలను ఎదిరించలేక అస్త్రసన్యాసం చేస్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీకి చిక్కకుండా తన సహచర మహిళలందరితో కలిసి ఆత్మార్పణ చేసుకుందనేది పద్మావత్ పద్య సారాంశంరాణి పద్మిని నిజ వృత్తాంతంపై చరిత్రలో భిన్న కథనాలు ప్రాచుర్యంలో వున్నాయి. ఆమె సింఘాల్ (ఇప్పటి శ్రీలంక) రాజ్యానికి చెందిన వనిత అని, అపురూప సౌందర్యవతి అని చరిత్ర చెబుతున్నది. ఓ పావురం వల్ల పద్మావతి అందచందాలను తెలుసుకున్న చిత్తోర్‌ఘడ్ మహారాజు రావల్త్రన్‌సింగ్ సింఘాల్ దేశానికి వెళ్లి ఆమెను స్వయంవరంలో గెలుచుకున్నాడనేది ఓ చారిత్రక కథనం. రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధం గురించిన ప్రామాణికమైన సమాచారమేది చరిత్రలో లేదు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటను 1303లో ఆక్రమించుకున్నట్లుగా చరిత్ర చెబుతున్నది. అయితే సూఫీ కవి మాలిక్ మహ్మద్ పద్యంలో 14వ శతాబ్దంలో చిత్తోర్‌ఘడ్‌పై దండయాత్ర జరిగినట్లుగా పేర్కొనడం జరిగింది. దీంతో మాలిక్ మహ్మద్ కేవలం ఊహాజనితంగా పద్మావతి అందచందాలను అభివర్ణిస్తూ పద్యాన్ని లిఖించాడని, ఆయన వర్ణనలకు చారిత్రక ఆధారాలు లేవని చెబుతారు. అసలు రాణి పద్మావతి చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన సమాచారమేది లేదని, ఇప్పటివరకు కల్పితగాథలే ప్రచారంలో వున్నాయని నవీన చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. అయితే రాజపుత్రులు మాత్రం ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి ప్రతీకగా రాణిపద్మావతిని అభివర్ణిస్తారు.
    రాజపుట్ ల అందోళన .... 
    ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి రాణి పద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీ మధ్య ప్రణయ సన్నివేశాల్ని సృష్టించారని రాజ్‌పుత్ సంఘాల ప్రధాన ఆరోపణ. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జైఘడ్ కోటలో పద్మావతి చిత్రీకరణను రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన కర్నీసేన సభ్యులు అడ్డుకున్నారు. సినిమాకు సంబంధించిన విలువైన సెట్ ప్రాపర్టీస్‌ను ధ్వంసం చేశారు. దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీపై భౌతికంగా దాడిచేశారు. దీంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో దాదాపు నెలరోజుల పాటు చిత్రీకరణను నిలిపివేశారు. మరలా ఈ ఏడాది మార్చిలో కోల్హాపూర్‌లో చిత్రీకరణను రాజ్‌పుత్ సంఘాలు అడ్డుకున్నాయి. పెట్రోల్‌బాంబులు, కర్రలతో దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. మ సమ్మతితోనే పద్మావతి చిత్రాన్ని విడుదల చేయాలని లేని పక్షంలో థియేటర్లను సైతం దహనం చేస్తామని రాజ్‌పుత్ కర్నీసేన సభ్యులు హెచ్చరించడం ఈ సినిమా వివాద తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ నెల 3న చిత్తోర్‌ఘడ్ పట్టణంలో క్షత్రియ, రాజ్‌పుత్ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాజ్‌పుత్‌సేన నేషనల్ కన్వీనర్ ప్రమోద్‌రానా..పద్మావతి చిత్రాన్ని రాజ్‌పుత్ పెద్దలకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో రాజ్‌పుత్‌ల గౌరవాన్ని కించపరిచేలా దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ సన్నివేశాల్ని అల్లుకున్నారని ఆయన ఆరోపించారు. రాణిపద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీల మధ్య ఒక్క రొమాంటిక్ సన్నివేశాన్ని చూపించినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇదిలావుండగా పద్మావతి వివాదం రాజకీయరంగును పులుముకుంటున్నది. త్వరలో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నందువల్ల చిత్ర విడుదలను నిలిపివేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.రాజ్‌పుత్‌లకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ముందుకొస్తున్నాయి.

    - ఎడిటోరియల్ డస్క్  

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పద్మావతి వివాదాల ప్రయాణం.. అసలు కధేంటి .. ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top