గరగపర్రులో దళితుల ఆత్మగౌరవ నినాదం వినిపించి ఆరు నెలలు గడుస్తున్నాయి. రాజీ యత్నాలు.. మంత్రుల శాంతి సందేశాలు పై పూత మందుల్లా ఉపయోగ పడ్డాయే తప్ప వారి మనసుల్లో రగిలే దావాగ్నిని చల్లార్చలేక పోయాయి. ఈ దశలో విరసం రచయిత పాణి రచించిన కధనం ...
ఆత్మగౌరవం-అంటరానితనం. అంటరానితనం ఉన్నంతవరకు దళితుల ఆత్మగౌరవం దెబ్బతింటూనే ఉంటుంది. దళితుల ప్రతిఘటనా పోరాటాలు సాగుతూనే ఉంటాయి. దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అయినా, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అయినా అంటరానితనం ఉన్నంత వరకు దళితుల ఆత్మగౌరవ ఆకాంక్షలకు భంగపాటు కలుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి రూపాల్లో కాస్త తేడా ఉండొచ్చు. అంటరానితనం ఉన్నంత వరకు దళితుల ఆత్మగౌరవ సమస్య పరిష్కారం కాదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి దగ్గరిలో ఉండే గరిగపర్రులో దళితులు ఊరి చెరువు కట్ట వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ చిన్న ఆకాంక్షను ఊళ్లోని అగ్రకులస్తులు భరించలేకపోయారు. అది కేవలం ఒకానొక విగ్రహాన్ని నిలబెట్టడమే కాదు. దళితులుగా అదొక స్వయ ప్రకటన. వాస్తవానికి అక్కడ ఎన్టీఆర్, గాంధీ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. దళితులుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. అదొక అభినివేశం. దాని అర్థం అగ్రకులస్థులకు తెలుసు. దేశమంతా దళితులు అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయడంలో కాని, అగ్రకులస్థులు అడ్డుకోవడంలో, అవమానపరచడంలో ఉన్న అంతరార్థం ఇదే. దానికి కేంద్రం అంటరానితనం.
గరగపర్రులో కూడా దళితులు అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచననే ఊరివాళ్లు భరించలేకపోయారు. అంబేద్కర్ విగ్రహం ఊళ్లో ఉంటే ఊరినే మాలపేట అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు అక్కడ నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆగ్రకులస్థులు మాయం చేశారు... ఇక ఆ తర్వాత ఊళ్లో జరిగిన పరిణామాలు పత్రికల్లో వచ్చాయి.
అంబేద్కర్ ఈ దేశంలో దళితుల ఆత్మగౌరవ ప్రతీక. అంబేద్కర్ చైతన్యం కుల నిర్మూలనకు ప్రేరణ. గరిగపర్రుల్లో అగ్రకుల పెత్తందార్లు అంబేద్కర్ అనగానే మండిపడటానికి కారణం ఇదే. ఊళ్లో అగ్రకుల రాజకీయ నాయకులు, సంస్కర్తల విగ్రహాలు ఎన్ని నెలకొల్పినా వాళ్లకు అభ్యంతరం ఉండదు. దళితుల ఆత్మగౌరవాన్ని సూచించే అంబేద్కర్ విగ్రహాన్ని అనుమతించకపోవడానికి కారణం అంటరానితనం.
ఇక దీనికి ఊళ్లో అగ్రకుల పెత్తందార్లు అధికారపార్టీ వాళ్లు కావడం, తద్వారా రాజకీయ ప్రాబల్యం ఉండటం, అధికార యంత్రాంగమంతా అండగా ఉండటం.. మొదలైనవన్నీ ఈ దుర్మార్గానికి కలిసి వచ్చాయి. ఊళ్లో ఒక వర్గానికి ఇవన్నీ ఉన్నా అవతల అంటరానివారు కాకుంటే, అంబేద్కర్ విగ్రహం కాకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఊరి దళితులు కాకుండా పేరు మోసిన నాయకులైనా ప్రతిష్ఠించేందుకు వచ్చి ఉంటే గరగపర్రు అగ్రకులస్థులు ఇంతగా తెగపడి ఉండేవారు కాకపోవచ్చు. ఊళ్లో అంటరాని జనం తమ ఆత్మగౌరవ చిహ్నంగా, సొంత చొరవతో అంబేద్కర్ విగ్రహం నిలబెట్టాలనుకోవడంతో కుల సామాజిక సంబంధాలు వికృతంగా బట్టబయలయ్యాయి.
అంబేద్కర్ 126 జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న సభ జరిపి, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో మొదలైన ఘర్షణ ఇప్పటికీ సాగుతూనే ఉన్నది. మే 5న ఊరివాళ్లు దళితులను సాంఘిక బహిష్కారం చేశారు. గరగపర్రు దళితులకు భూమి లేదు. కొందరు ఆగ్రకులాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. మిగతావాళ్లంతా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో కూలీ పనులు చేసుకునేవారు. సాంఘిక బహిష్కారం పేరుతో ఎప్పటి నుంచో కౌలు చేసుకుంటున్న భూమిని వెనక్కి తీసుకున్నారు. కూలీ పనులకు దూరం చేశారు. అంటరానితనం అనే సాంఘిక దుర్మార్గం దగ్గర మొదలైన సమస్య దళితుల ఆర్థిక జీవితాన్ని దిగ్బంధం చేస్తూ సాంఘిక బహిష్కారానికి దారి తీసింది. అంటరానితనం కేంద్రంగా అగ్రకులాధిపత్యం దళితుల సాంఘిక, ఆర్థిక జీవితాలను నిర్దేశించి, అవమానించి, వివక్షకు గురిచేసి, జీవనోపాధులను రద్దు చేసే దాకా విస్తరిస్తుందనడానికి గరగపర్రు ఒక ఉదాహరణ.
కుల సామాజిక సంబంధాల మీద ఆధారపడి నడిచే గ్రామం ఇలా ఉంటే, రాజ్యాంగం మీద ఆధారపడి పని చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటిలాగే గరగపర్రులో వ్యవహరించింది. అంబేద్కర్‌కు ఉన్న గుర్తింపు రీత్యా అమరావతిలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని(125 జయంతి పురస్కరించుకొని...) ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గరగపర్రు విషయంలో ఎలా స్పందించి ఉండాలి? అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దళిత బూర్జువాను సంతృప్తిపరిస్తే చాలు. భూమిలేని, కూలీ పనులు చేసుకొని బతికే దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆత్మగౌరవ ప్రతీకగా నిలబెట్టుకోవాలంటే తన పార్టీకే చెందిన అగ్రకులస్థులు గరగపర్రులో ఎలా వ్యవహరిస్తే మాత్రం ఆయనకు పోయిందేమిటి? అంబేద్కర్ పాలకవర్గాలకు విగ్రహమాత్రుడే. అంటరానితనం కొనసాగుతున్న పల్లెసీమల్లోని నిరుపేద దళితులకు అంబేద్కర్ ఆత్మగౌరవ చిహ్నం. అంబేద్కర్‌ను అర్థం చేసుకోవడంలో ఈ మౌలికమైన తేడా ఉన్నది. ఈ సంగతి బూర్జువా దళిత నాయకులకు తెలుసు. కానీ మాట్లాడరు. ఎందుకంటే వాళ్లకు పేద, సాధారణ దళితులు కేవల ఓటర్లు మాత్రమే. పార్లమెంటరీ మార్గంలో దళితులను నడిపించే వాళ్లందరికీ అంతే. నిరుపేద దళితుల ఆత్మగౌరవం భంగపడ్డప్పుడు కూడా వీళ్లు నిజాయితీతో స్పందించడం లేదు. కులానికి సంబంధించిన మౌలిక విషయాలన్నిటినో చర్చలోకి తీసుకొని వస్తోంది. గరగపర్రు దళితుల ఆత్మగౌరవ పోరాటంలో ఎన్ని అవరోధాలైనా ఎదురు కావచ్చు. దళిత, ప్రజాస్వామిక శక్తులన్నీ వాళ్ల పక్షాన నిలబడాలి. ------virasam.org సౌజన్యంతో
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి