Translate

  • Latest News

    26, డిసెంబర్ 2017, మంగళవారం

    డిసెంబర్ 26


    ఈ తేదీ వినగానే ఆంధ్ర ప్రదేశ్  కోస్తా తీరం చిగురుటాకులా వణికిపోతుంది. ఈ తేదీనే కోస్తా ప్రాంతంలో రెండు బీభత్సకాండలు జరిగాయి. రెండు ఘటనలకు మధ్య 16 ఏళ్ల వ్యవధి ఉంది. మొదటిది 1988 లో జరిగితే... రెండవది 2004 లో జరిగింది. ఈ  రెండు ఘటనలు కోస్తా లో మహా ఉపద్రవాన్ని సృష్టించాయి. రెండిటికి కారణం మనిషే... మనిషి చేసిన తప్పుల వలెనే జరిగాయి. మొదటిది తెలిసి చేసిన తప్పు. రెండవది తెలియక చేసిన తప్పు. 
    మనువాదం వేళ్లూనుకున్న ఈ సమాజంలో ఆ విష వృక్షము ప్రసాదించిన ఫలాలను తిన్న నేటి మానవులు కులవాదం లో కూరుకుపోయి... కోస్తాలో ఓ  ఆధిపత్య కులం మరో ప్రధాన కులాన్ని అధికార అహంకారంతో అణచివేయడానికి ప్రయత్నించినపుడు, అంతిమంగా ఆ కుల నాయకుడిని భౌతికంగా లేకుండా మట్టుపెట్టినపుడు... ఆ కులం పునాదుల్లో నుంచి  పుట్టుకొచ్చిన భూకంపమే.... 1988 డిసెంబర్ 26 మారణకాండ. దాని ఫలితంగా దాదాపు 30 మందికి పైగా మరణించారు. 21 పట్టణాల్లో కర్ ఫ్యూ  విధించారు. బెజవాడలో ఏకంగా నెల రోజుల పాటు కర్ ఫ్యూ కొనసాగింది. ఇది నిస్సందేహంగా మనిషి తెలిసి చేసిన తప్పే. ఆ మారణ కాండకు నేటితో 30 ఏళ్ళు నిండాయి.
    పై ఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రోజు కోస్తా మరోసారి తల్లడిల్లింది. అయితే ఈ ఘటన ప్రత్యక్షముగా మన భౌగోళిక ప్రాంతంలో జరగక పోయినప్పటికీ దాని ప్రభావం మన కోస్తా  ప్రాంతంపై తీవ్రంగానే పడింది.  హిందూ మహా సముద్రంలో 2004 డిసెంబర్ 26 న సంభవించిన సునామీ 14 దేశాల్లో  దాదాపు 2 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కువగా ఇండోనేషియా, సుమత్రా దీవులు దెబ్బతిన్నప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో కోస్తా తీరం కూడా వణికి పోయింది. ఆ రోజు హిందూ మహా సముద్రంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 9. 1- 9. 3 గా నమోదవడం గమనార్హం. అలలు 100 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి. దక్షిణ భారత దేశంలో దాదాపు 2 వేల మంది,  కృష్ణా , గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 200 మంది సముద్ర గర్భంలో కలసిపోయారు. ఈ ఉపద్రవానికి కారణం మనిషి తెలియక చేసిన తప్పుల కారణంగా వాతావరణములో, భూగోళంలో సంభవించిన మార్పులు.
    ఈ రెండు ఉపద్రవాల నుంచి మనం చాలావరకు గుణపాఠాలు నేర్చుకున్నాం. మళ్ళి మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నాం. అందుకే ఈ మూడు దశాబ్దాలుగా బెజవాడ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగానే ఉంది. మన శాస్త్రవేత్తలు సాధించిన అపూర్వ పరిశోధనల ఫలితంతో ఇప్పడు ప్రకృతి ఉపద్రవాలను ముందే పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతున్నాం. ఏదేమైనా డిసెంబర్ 26 అనేది ఒక హెచ్చరికగా మనం గుర్తు పెట్టుకుని మనం అప్రమత్తతగా మెలగకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ ఆ ఉపద్రవాలు సంభవించే ప్రమాదముంది తస్మాత్ జాగ్రత్త...
                                                                                                                                               -మానవేంద్ర 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: డిసెంబర్ 26 Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top