Translate

  • Latest News

    20, డిసెంబర్ 2017, బుధవారం

    అభినవ శ్రీకృష్ణదేవరాయా.. కల్వకుంట చంద్రశేఖరాయా..

    అభినవ తెలంగాణ భోజా ... అభినవ శ్రీకృష్ణ దేవరాయ కల్వకుంట చంద్రశేఖరాయా బహుపరాక్... బహుపరాక్... నాటి రాయల వైభవం మళ్ళి ఇన్నాళ్లకు మీ పాలనలో చూస్తున్నాం. నాడు రాయల వారు అష్ట దిగ్గజాలను పోషించినట్టుగానే మీరు ఇప్పుడు మీ కొలువులో ఎందరో కవులకు  కమిషన్ చైర్మన్లు, మెంబర్లు పదవులిచ్చి... మరింకెన్నో ఉన్నత పదవులిచ్చి మీ వందిమాగధాలుగా మార్చుకున్నారు. పట్టు పీతాంబరాలతో వారిని ఉచిత రీతిన సన్మానిస్తున్నారు.  తరతరాలకు చరిత్రలో నిలిచిపోయేలా ప్రపంచ తెలుగు మహాసభలను నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభం, ముగుంపు సంబరాలకు కలిపి కేవలం బాణాసంచాకే 2.25 కోట్లు ఖర్చు పెట్టారంటేనే మీ వైభవం ఏమిటో చెప్పకనే చెబుతుంది.  ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారిని పిలిపించి, వారికి ఐదు రోజుల పాటు బ్రహ్మాండమైన ఆతిధ్యమిచ్చారు.  కొండొకచో ఎక్కడో ఓ మూల విరసం...అంటూ కొందరు కవులు నిరసన స్వరం వినిపిస్తే వినిపించొచ్చు గాక... ఆ స్వరాలను కూడా వేదిక దరిదాపులకు రానీయకుండా ముందస్తు అరెస్టులంటూ ఇళ్లకు వెళ్లి మరీ అరెస్టులు సారీ మీ భాషలో అదుపులోకి తీసుకున్నారు. మహాసభల వేదికపై పద్యాలు పాడి మీ పాండిత్య ప్రకర్షను నిరూపించుకున్నారు.
    తొమ్మిదో క్లాస్ లోనే పద్యం రాసిన మీరు.. ఈ ఎదవ రాజకీయాల్లోకి రాకుండా ఉంటె నిస్సందేహంగా ఎన్నో కావ్యాలు రాసి సాహిత్య అకాడమీ అవార్డులు, జ్ఞానపీఠ్ అవార్డులు కొట్టేసి ఉండేవారు. మా అభిలాష ఏమిటంటే ఇప్పటికయినా మీరు కొన్నాళ్ల పాటు రాజ్యాన్ని యువ రాజులుంగారు తారక రామారావులుమ్ గారికి అప్పగించి మీరు ఫామ్ హౌస్ లో ఏకాంతంగా కూర్చుని నాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద రచించినట్టుగా ఒక గొప్ప కావ్యాన్ని రచించి ప్రపంచ తెలుగు ప్రజలందరికీ కానుకగా సమర్పించాలని కోరుకుంటున్నాము.
                                                                                                                                                      ఇట్లు
                                                                                                                                            మీ అభిమానులు 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అభినవ శ్రీకృష్ణదేవరాయా.. కల్వకుంట చంద్రశేఖరాయా.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top