
వందేళ్ల కిందట బెజవాడ ఓ చిన్న పట్టణం... సుమారు 40 ఏళ్ల కిందట విజయవాడ నగరంగా రూపుదాల్చింది. ఇప్పుడు రాజధాని నగరంగా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. అయితే మెట్రోపాలిటన్ సిటీ అనిపించుకోవడానికి కావలసిన లక్షణాలు మాత్రం ఇంకా విజయవాడకు అబ్బలేదు. మెట్రోపాలిటన్ సిటీ అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలు... వివిధ మతాలు, కులాలు, తెగల ప్రజలతో పాటు, విదేశీయులు అంతా ఈ నగరాన్ని ఓన్ చేసుకోగలగాలి. మన విజయవాడ అనుకోగలగాలి. అప్పుడే అది మెట్రోపాలిటన్ సిటీ అనిపించుకోగలుగుతుంది. అటువంటి లక్షణాలేవీ ఇంకా మన బెజవాడకు అబ్బలేదు... పైగా ఇంకా ఏ మూలకు వెళ్లినా కులం కంపు కొడుతోంది. ఇది నేను అనే మాట కాదు... కులం తోకలు కత్తిరిద్దాం అనే ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ వాస్తవాలు. అందరికీ తెలిసిన విషయాలే అయినా ఆ టీవీ వాళ్ళు మరీ అంత నగ్నంగా కళ్ళ ముందు చూపించేసరికి ఎక్కడో మనసు లోలోతుల్లో చివుక్కుమంది. ఆ ఛానెల్ వారు విజయవాడ లో ఏ ప్రాంతానికి ఇంటికి అద్దె కోసం వెళ్లినా ముందు కులమేమిటి అని అడిగారు. తర్వాత మా కులం వాళ్లకే ఇస్తాం అని కూడా నిర్మోహమాటంగా చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ఆ ఛానల్ వారు స్టూడియోలో పెట్టిన చర్చలో స్వయంగా ఎస్.సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ నేను అద్దె ఇంటి కోసం 3 నెలలు తిరిగానని, నా కులం తెలిసి అద్దెకు ఇవ్వనున్నారని వాపోవడం పరాకాష్ట. పైగా ఈ విషయం తానూ సి.ఎం.ఓ లో ఫిర్యాదు చేశానని చెప్పడం కొసమెరుపు. ఏదేమైనా ఈ కులం జంఝాటాల నుంచి విముక్తి అయితేనే విజయవాడ అందరి వాడ అయ్యేది.

విజయవాడ మొదటి నుంచి మహా నగరంగా ఎదగకపోడానికి కారణాలు ఇక్కడ ఆ స్థాయి కర్మాగారాలు, పెద్ద పెద్ద కంపెనీలు ఏవి లేకపోవడం... విశాఖ లో ఉక్కు ఫాక్టరీ, పోర్ట్ ఉండడం వల్ల అది చాల ఏళ్ల కిందటే మహా నగరమనిపించుకుంది. రాజధానికి కావలసిన అన్ని లక్షణాలు దానికి ఉన్నాయి. కాకపొతే రాష్ట్రంలో ఒక మూల ఉండిపోవడమే దానికి మైనస్... విజయవాడ రాష్ట్రానికి సెంటర్ పాయింట్ లో ఉండడం అన్నిటికన్నా ప్లస్ పాయింట్. సౌత్ ఇండియాలో ముఖ్యమైన రైల్వే జంక్షన్ కావడం మరో ప్లస్ పాయింట్. విజయవాడ, గుంటూరు కలిపి భవిష్యత్తులో జంట నగరాలుగా ఎదగడానికి అవకాశం ఉండడం మరో ప్లస్ పాయింట్... అయితే ఇన్ని ప్లస్లు ఉన్నా విజయవాడ వాణిజ్య నగరంగా ఎదిగిందే కానీ పారిశ్రామిక నగరంగా ఎదగలేదు. అదే హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ అటు వాణిజ్య, ఇటు పారిశ్రామిక నగరాలుగా... అట్ ద సేమ్ టైం... సాఫ్ట్ వేర్ హబ్ లుగా కూడా ఎదగడం గమనించాల్సిన విషయం.

విజయవాడ పారిశ్రామికంగా ఎదగక పోవడానికి కారణం వామపక్షాలంటూ నింద వాళ్ళ మీద వేసి తప్పించుకుంటారు కానీ వాస్తవానికి ఈ 70 ఏళ్లలో విజయవాడకు ఎంపి గా చేసిన వారెవరూ చిత్తశుద్దిగా ఒక్క పరిశ్రమ తేవడానికయినా ప్రయత్నం చేయలేదన్నది నిజం. పెద్ద పరిశ్రమలు వచ్చి ఉంటే విభిన్న రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ ప్రజలతో సహ జీవనం చేసి ఉంటే ఇక్కడ ప్రజల మనస్తత్వాల్లో కూడా మార్పు వచ్చి ఉండేదేమో... అందుకే విజయవాడ ఇంకా నగరంగా ఉందే కానీ మెట్రోపాలిటన్ సిటీ అనిపించుకోలేక పొతొంది.
-మానవేంద్ర
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి