Translate

  • Latest News

    4, డిసెంబర్ 2017, సోమవారం

    ఏపీ లో రగులుతున్న బీసీలు ... కాపుల్లో అనుమాన జ్వాలలు


    తాంబూలాలు ఇచ్చేశాం... తన్నుకు చావండి అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఖరి. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. స్వయంగా అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, రిజర్వేషన్ ప్రకటించిన రోజునే రాష్ట్రంలో బీసీలు రోడ్డెక్కడం పార్టీకి తలనొప్పిలా మారింది.
    రిజర్వేషన్లు ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ సమస్యను మరింత జఠిలం చేసేశారని కాపు వర్గం మథనపడుతోంది. ముఖ్యంగా కేవలం 11శాతం మంది మాత్రమే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉన్నారనే సంఖ్య వారికి మింగుడుపడడం లేదు. అదే సమయంలో 5శాతంతో సరిపెట్టుకోమనడం జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా న్యాయపరంగా నిలబడే అవకాశం లేదనే ప్రచారం అసలుకే ఎసరు తెచ్చేలా ఉందని చెబుతున్నారు. మరోసారి కోర్టుల్లో బీసీ ఎఫ్ ని కొట్టేస్తే ఇక భవిష్యత్తులో కాపులకు బీసీ హోదా కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో కేంద్రం కూడా 9వ షెడ్యూల్ పెట్టడానికి సహకరించే అవకాశం లేదు. చిక్కుల్లో పోలవరం వంటి విషయాల్లోనే పెనుదుమారం దిశగా సాగుతుంటే దేశమంతా మంట రాజేసే రిజర్వేషన్ల విషయంలో మోడీ వేలుపెడతారని ఆశించడం అత్యాశే అవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గాల పెంపుదల వంటి విషయాల్లోనే బాబుని బేఖాతరు చూస్తూ, రైల్వేజోన్ ఆశలపై నీళ్లు జల్లిన వాళ్లు కాపుల సమస్యల పట్ల కనికరిస్తారనుకోవడం కల్లేనని చెబుతున్నారు. దాంతో కాపుల బీసీ హోదా కేవలం ప్రకటనకే పరిమితం అయ్యే ప్రమాదంలో పడిందని సందేహిస్తున్నారు.  బీసీల ఆందోళనను తగ్గించి, వారిని శాంతపరిచేందుకు టీడీపీ నాయకత్వం బీసీ మంత్రులను రంగంలోకి దింపింది. ఇది ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. 

    శ్రీహర్ష 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీ లో రగులుతున్న బీసీలు ... కాపుల్లో అనుమాన జ్వాలలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top