Translate

  • Latest News

    4, జనవరి 2018, గురువారం

    ఈ తాంత్రిక పూజల గొడవేంది... బాబూ...

    భిన్నస్వరంలో గత నెల 26 న   డిసెంబర్ 26 శీర్షిక తో ఒక కధనం ఇచ్చాం. 1988 లో, 2004 లో అదే రోజు జరిగిన ఘోరాల గురించి చెప్పాం. ఆ డేట్ విజయవాడను వదిలిపెట్టేటట్టు లేదు. ఇప్పడు అదే డిసెంబర్ 26 వ తేదీ అర్ధరాత్రి దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారం రాష్ట్రంలో అట్టుడికిస్తోంది. ముఖ్యంగా స్వామిజిలు, బ్రాహ్మణ సంఘాలు, ఆధ్యాత్మిక వేత్తలు తీవ్ర అపచారం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఇంతకూ అసలు ఏమి జరిగిందనేది ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు.
    ఏతా వాతా తెలిసిన విషయమేమిటంటే దుర్గ గుడిలో  గర్భాలయంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న కవచాన్ని తొలగించి ఉగ్ర రూపంలో ఉండే దుర్గా దేవికి తాంత్రిక పూజలు చేశారనేది ఆరోపణ... ఈ పూజలు లోకేష్ బాబు కోసం చంద్రబాబు చేయించాడనేది రాజకీయ ప్రత్యర్థి వర్గాల వారి ఆరోపణ. అసలు ఈ పూజలు ఎవరు... ఎవరి కోసం చేసినా అది మహాపరాధం అని ఆధ్యాత్మిక వేత్తల ఆందోళన. ఎందుకంటే... ఇంద్రకీలాద్రి పై ఉగ్ర రూపంలో ఉన్న దుర్గా దేవిని  క్రీ .శ.8 వ శతాబ్దంలో అది శంకరాచార్యుల వారు శాంతపరచి, ఇప్పుడు మనం చూస్తున్న శాంతి స్వరూపం లోకి మార్చారనేది భక్తుల విశ్వాసం. ఉగ్ర స్వరూపంలో ఉన్న అమ్మవారిని శాంత స్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా చేసిన కళాన్యాస కవచాన్ని తొలగించడం ఘోర అపచారమని స్వామీజీలు గగ్గోలు పెడుతున్నారు. పైగా ఈ ప్రక్రియలో కవచంపై ఉన్న స్వర్ణ రేఖలు కూడా దెబ్బతిన్నాయనేది మరో ఆరోపణ. ఇది  దేశానికే మహా అరిష్టం అని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    ఈ మొత్తం వ్యవహారం ఆలయ ప్రధాన అర్చకుడి పర్యవేక్షణలో అవనిగడ్డకు చెందిన ముగ్గురు ప్రైవేటు అర్చకులు చేశారని చెబుతున్నారు. ఈ.ఓ. ను  అడిగేతే... ఆబ్బె మేము రాత్రి పూత శుద్ధి మాత్రమే చేయించాం. ఎటువంటి పూజలు జరగలేదు అని చెబుతున్నారు. ప్రధాన అర్చకుడు ఈ.ఓ.. ఆదేశం లేకుండా ఇంతటి సాహసానికి పూనుకోడు.  ఈ.ఓ. ప్రభుత్వ పెద్దల ఆదేశం లేకుండా ఇంతటి సాహసానికి ఒడిగట్టరు.  ప్రభుత్వం ఈ వ్యవహారంలో ప్రాధమికంగా దుర్గ గుడిలో క్యూ లైన్ ఇనస్పెక్టర్ ను ఆ విభాగం  నుంచి వేరే విభాగానికి బదిలీ చేసింది.  అంటే ఇంతటితో సరిపెడుతుందా... అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
    ఏది ఏమైనా ప్రజల్లో గూడు కట్టుకున్న అనుమాన పెనుభూతాల్ని తరిమి వేయాలంటే ప్రభుత్వం నిక్ష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజాల్ని నిగ్గు తేల్చాలి. లేదంటే దుర్గమ్మ ఉగ్ర  స్వరూపిణి అవతారం ఎత్తితే... ఇంకా ఏమైనా ఉందా... కృష్ణమ్మ వచ్చి దుర్గమ్మ ముక్కు పుడకను తాకేయదూ  ... అదే జరిగితే మన అమరావతి రాజధాని మొత్తం కృష్ణలో కలిసిపోదూ... సో.. చంద్రబాబూ గారూ . వెంటనే సమగ్ర విచారణ జరిపించి మా అనుమానాలు నివృత్తి చేయండి సారూ... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ తాంత్రిక పూజల గొడవేంది... బాబూ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top