Translate

  • Latest News

    1, మార్చి 2018, గురువారం

    బాల్యంపై బాంబుల వర్షం



    సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ దళాలు, వేర్పాటువాద మిలిటెంట్లు, ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. తుపాకుల తూటాలు, విస్ఫోటన శబ్ధాలు, శిథిలమయ్యే భవనాలు, వాటికింద పడి ప్రాణాలు వదిలే పసివాళ్లు.. ఇదంతా అక్కడ నిత్య కృత్యం. సిరియాలో బాల్యం  రక్తమోడుతోంది. గత కొన్ని సం‍వత్సరాలు అంతర్యుద్ధంలో చిక్కుకొని.. నిత్యం బాంబు దాడులు, తుపాకుల మోతతో రక్తసిక్తమవుతున్న సిరియాలో బాల్యం చితికిపోతోంది. తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మషం  లేని చిన్నారుల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లను కదిలిస్తున్నాయి. యుద్ధక్షేత్రంగా  మారిన సిరియాలో అమాయక బాల్యం ఎలా నరకం అనుభవిస్తుందో.. ఎలా నిత్యం రకప్తుటేరుల మధ్య నలిగిపోతుందో చాటుతున్న ఫొటోలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.
    ప్రే ఫర్‌ సిరియా’ (సిరియా కోసం ప్రార్థించండి) హాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను పంచుకుంటున్నారు. సిరియాలో  ఛిన్నాభిన్నామైపోతున్న బాల్యాన్ని కాపాడాలని, మానవత్వాన్ని చూపాల ని, అక్కడి చిన్నారులకు కూడా అందరి బాలల్లాగే సంతోషంగా బతికే హక్కు కల్పించాలని, ఈ దిశగా ప్రపంచ దేశాల్ని కదిలించాలని కోరుతూ ఈ హాష్‌ట్యాగ్‌ ఉద్యమం నడుస్తోంది.
    సిరియాలోని గౌటా నగరం శవాల దిబ్బగా మారింది. గత ఎనిమిది రోజులుగా నగరంలో రక్తం ఏరులై పారుతోంది. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. వైమానిక దాడుల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 540 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సంఖ్య 700కు పైనేనని అంతర్జాతీయ సమాజం చెబుతోంది. మృతుల్లో ఎక్కువ మంది ముక్కుపచ్చలారని చిన్నారులు, మహిళలు ఉన్నారు. 

    నిజానికి ఇక్కడ నెల రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించింది. రష్యా-సిరియా బలగాలు దానిని తోసిరాజంటూ వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుత సిరియా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    నిజానికి గౌటా గత ఐదేళ్లుగా ప్రభుత్వ బలగాల అధీనంలోనే ఉంది. అయితే రష్యా, సిరియా దాడులతో బిక్కచచ్చిపోయిన ఉగ్రవాదులు నగరంలోకి చొచ్చుకొచ్చి పౌరుల్లో కలిసిపోయారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. ఇక ఇక్కడి ప్రజల పరిస్థితి...  ముందు నుయ్యి, వెనక గొయ్యి చందాన తయారైంది. ఓ వైపు మిలిటెంట్లు, మరోవైపు ప్రభుత్వ బలగాల దాడులతో నలిగిపోతున్నారు  ... .ప్రే ఫర్‌ సిరియా’ (సిరియా కోసం ప్రార్థించండి)
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బాల్యంపై బాంబుల వర్షం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top