Translate

  • Latest News

    9, మార్చి 2018, శుక్రవారం

    విగ్రహాలపై కాదు... భావజాలంపై దాడులు


    మతోన్మాదుల దాడుల రూట్ మళ్లింది. నిన్నటి దాకా వ్యక్తుల పైన జరిగిన దాడులు... ఇప్పుడు విగ్రహాల మీదకు మళ్ళాయి. విగ్రహాల ధ్వంసం ద్వారా అవతలి వారిని రెచ్చగొట్టే పనిలో పడ్డారు.  ఇప్పటి వరకు ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని, కొంతమంది భావజాలాన్ని టార్గెట్ చేసుకొని జరిగిన దాడులు ఇక విగ్రహాలకు పాకింది. . త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడైన తర్వాత ఆ రాష్ట్రంలో రెండు మూడుచోట్ల బీజేపీ కార్యకర్తలు విజయోత్సాహంతో రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాలను కూల్చారు. కొన్నిచోట్ల సీపీఎం కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. వీటిని చూసి ఉత్సాహపడిన తమిళనాడు బీజేపీ నేత హెచ్. రాజా 'కులోన్మాది పెరియార్ ఇ.వి. రామస్వామి విగ్రహానికి కూడా ఇదే గతి పడుతుంద'ని ఫేస్ బుక్ లో  హెచ్చరించడం, ఆ తర్వాత  కొద్ది సేపటికే కొందరు దుండగులు వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని కూల్చడం చూస్తుంటే ఒక పధకం ప్రకారమే జరిగినట్టు అర్ధమవుతోంది. లేదా రాజా వ్యాఖ్యలకు వాళ్ళను అందుకు ప్రేరేపించి ఉండవచ్చు.అలా చేయడం ఘనకార్యమన్నట్టు సీనియర్ నేతలే వ్యాఖానించడం  అగ్నికి వాయువు తోడైనట్టయింది.
    ఈ విధ్వంసానికంతకూ లక్ష్యంగా మారిన వారు వ్యక్తులు కాదు. కోట్లాది మంది ప్రజలు విశ్వసించే భావాలకు స్ఫూర్తి ప్రదాతలు.  విగ్రహాలను కూల్చినంతమాత్రాన ఆ భావాలు, సిద్ధాంతాలు మటుమాయమవుతాయని అనుకుంటే అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉండదు.  తమ జీవితకాలంలో అందరిపైనా బలమైన ముద్రవేసిన నాయకులు...  మార్పు కోసం తపించినవారు...  మెరుగైన సమాజానికి పాటుబడినవారు. . . లెనిన్ అయినా, అంతకు చాలాకాలం ముందు మార్క్స్  అయినా మన దేశం పై బ్రిటిష్ వలసవాదుల పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వివిధ రూపాల్లో ఇక్కడ జరుగుతున్న పోరాటాలను సమర్ధించారు. ప్రసార సాధనాలు అంతగాలేని 1850 సమయంలో కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న పోరాటాలను అధ్యయనం చేసి వాటిని విశ్లేషించినవాడు మార్క్స్.  1857నాటి సిపాయిల తిరుగుబాటుపై వచ్చిన వార్తల ఆధారంగా అమెరికాకు చెందిన న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్లో మార్క్స్, ఏంగెల్స్ పలు వ్యాసాలు రాశారు. 'పూర్ణ స్వరాజ్' కోసం పోరాడాలని 1929 డిసెంబర్ 19న లాహోర్లో కాంగ్రెస్ తీర్మానించడానికి పదేళ్లముందే భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాలని అభిలషించినవాడు లెనిన్. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో ఎంఎన్ రాయ్ లాంటి వారికి తోడ్పాటునందించాడు.
    పెరియార్, అంబెడ్కర్  విగ్రహాలపై  దాడితో  మనువాదుల నిజ స్వరూపం బట్టబయలు 
     సమాజానికి వ్యాధిగా పరిణమించిన కులాన్ని నిర్మూలించడానికి, మహిళలకు సమాన హక్కులు సాధించడానికి, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడానికి పెరియార్ ఇ.వి. రామస్వామి చేసిన కృషి అసాధారణమైనది. తమిళనాట ఆయన నాయకత్వంలో సాగిన 'ఆత్మగౌరవ పోరాటం' దక్షిణాదినంతటినీ ప్రభావితం చేసింది. నవ భారతం ఏర్పడేనాటికల్లా దేశంలో అసమానతలు పోవాలని ఆయన కలలుకన్నాడు. ఇదే తరహాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్నీ ధ్వంసం చేశారు.  పెరియార్,  అంబెడ్కర్ విగ్రహాలపై  దాడితో బి.జె.పీ తన మనువాద  స్వభావాన్ని బయటపెట్టుకుంది. ఇది ప్రమాదకర ధోరణి . దీనికి ప్రజాస్వామ్య వాదులంతా ఒక్క తాటిపైకి వచ్చి   వెంటనే చెక్ పెట్టక పోతే భారతదేశం అగ్నిగుండంగా  మారే  ప్రమాదం ఉంది . 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: విగ్రహాలపై కాదు... భావజాలంపై దాడులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top