Translate

  • Latest News

    23, ఏప్రిల్ 2018, సోమవారం

    బహుజనుల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం


    దేశంలో బహుజన  వర్గాల్లో రాజకీయ చైతన్యం పెల్లుబుకుతోంది. ఇది దేశ రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ శకానికి నాంది కానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో జాతీయ స్థాయిలో దళిత బహుజనవర్గాల్లో వెల్లువెత్తిన చైతన్యం... గుజరాత్ ఎన్నికల్లో జిగ్నేష్ మేవాని ని గెలిపించుకుని అసెంబ్లీ కి పంపేదాక ఎదిగింది. ఆ పరిణామ క్రమంలోనే ఇప్పుడు మరో గొప్ప పరిణామానికి శ్రీకారం చుట్టారు ఐఐటీయన్లు.
     1970 దశకంలో నక్సల్ రాజకీయాలతో ప్రభావితమై ఉన్నత విద్యావంతులు వందలాది మంది అడవి బాట పట్టినట్టు గానే... ఇప్పుడు 50 మంది బహుజన వర్గాలకు చెందిన ఐఐటీ యన్లు కలసి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఇది దేశ  రాజకీయ చరిత్రలోనే ఒక విప్లవాత్మక పరిణామం. పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షల్లో జీతాలు పొందుతున్న వీరంతా తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి బహుజన్ ఆజాద్ పార్టీ స్థాపించారు. అంబేద్కర్ కు  నిజమైన వారసులైన వీరు ఎంతో దీర్ఘాలోచనతో, పకడ్బందిగా తమ ప్రణాళిక రూపొందించుకున్నారు. దాని ప్రకారం వీరు 2024 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదు. కాకపొతే 2020 లో బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రిహార్సల్ గా తీసుకుని పోటీచేయనున్నారు. అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి బేరీజు వేసుకుని ఆ తర్వాత పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల సాధనకు పోరాడడమే తమ పార్టీ లక్ష్యమని పార్టీ ప్రతినిధి నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి ఇంకా తమ పార్టీకి అనుమతి రావాల్సి ఉందని, ప్రస్తుతం క్షేత్రస్థాయి కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. 
    సి.పీ.ఎం లాల్...నీల్ నినాదం  అభిలషణీయం. 
    హైదరాబాద్ లో ఆదివారం ముగిసిన సి.పీ.ఎం జాతీయ మహాసభలలో పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్, నీల్ నినాదం ఇవ్వడం అభిలషణీయం. జై భీం... లాల్ సలాం కలసినప్పుడే దేశంలో మార్పు వస్తుందని ఆలస్యంగానైనా గుర్తించడం హర్షణీయం. లాల్, నీల్ జెండా నీడన ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ  రాజకీయ విధానాన్ని అందిస్తామని ప్రకటించడం శుభ పరిణామం. అయితే సి.పీ.ఎం దీనిని మహాసభల్లో నినాదానికి పరిమితం చేయకుండా ఆచరణాత్మకంగా అమలు చేస్తే నిజంగానే లాల్ ..నీల్ జెండాలు రెపరెపలాడడం ఖాయం. 
    -మానవేంద్ర 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బహుజనుల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top