
దక్షిణ భారత దేశంలో బి.జె.పీ కి కొద్దో...గొప్పో పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. గతంలో 2008 లో 110 సీట్లు సాధించి, ఇండిపెండెంట్లను కలుపుకుని ఎలాగోలా అధికారం చేజిక్కించుకుని దక్షిణాదిన తొలిసారిగా కాషాయ పతాకం ఎగరేసింది. యెడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే 2013 లో కాంగ్రెస్ పార్టీ 122 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. తొలిసారి అధికారం వెలగబెట్టిన బి.జె.పీ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరడంతో ప్రజలు ఛీ కొట్టారు. కనకపు సింహాసనంపై ఉయ్యాల లూగిన గాలి బ్యాచ్ ను చూసి ప్రజలు బేజారెత్తిపోయారు. దాంతో బి.జె.పీ బలం కేవలం 40 కు పడిపోయింది. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జె.డి.ఎస్ తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగి.. అది కూడా 40 సీట్లు సాధించింది. తిరిగి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా జె.డి.ఎస్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. తాజా సర్వేల ప్రకారం కర్ణాటకలో ఈ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ (113) అందుకోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కర్ణాటకలో దాదాపు 60, 70 స్థానాల్లో ప్రభావం చూపగల లింగాయత్ లకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరుగుపందెంలో ఒక అడుగు ముందంజలో ఉంది. బీ.జె.పీ వెనుకపడిపోయింది. మరోవైపు జె.డి.ఎస్ కీలకంగా పరిణమిస్తోంది. ఎన్నికల్లో రేపు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో జె.డి.ఎస్ కీలకం అవుతుంది. ఈ నేపథ్యంలో కే.సి.ఆర్. నిన్న దేవెగౌడ ను కలిశారు. ఇటీవల కె.సి.ఆర్ తో సన్నిహితంగా ఉంటున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ కన్నడిగుడు కావడంతో వీరిద్దరి మధ్య సంధానకర్తగా వ్యవహరించాడు. మరోవైపు తమిళనాడులో రేగిన కావేరి సెగల ప్రభావం కర్ణాటకలో ఉన్న తమిళ ఓటర్లపై పడనుంది. అలాగే ఆంధ్ర లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేసిన మోసం వలన రగిలిపోతున్న తెలుగు ఓటర్లు కూడా కర్ణాటకలో కీలక పాత్ర పోషించనున్నారు. ఒక వైపు లింగాయతులు, మరోవైపు తమిళ ఓటర్లు, ఇంకోవైపు తెలుగు ఓటర్లు బి.జె.పీ పై ముప్పేట దాడి చేయనున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి