Translate

  • Latest News

    25, మే 2018, శుక్రవారం

    కలగూర గంప ప్రయోగాలు ఫలించేనా..?


    దేశంలో నేడు 1975 నాటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సరిగ్గా నాటి ఇందిరా గాంధీ నియంతృత్వ పాలన లాగానే ఉంది నేటి నరేంద్ర మోడీ పాలన  కూడా... కాంగ్రెస్ పార్టీలో ఇందిర హయాం నుంచే ఏకవ్యక్తి స్వామ్యం మొదలైనది. మతతత్వ పార్టీ గా ముద్రపడ్డ బి.జె.పీ లో కూడా ఇంతకుముందు బహుళ నాయకత్వం ఉండేది. మోడీ హయాం నుంచి ఆ పార్టీలో ఏకవ్యక్తి స్వామ్యం మొదలైనది.  నేడు బి.జె.పీ లో మోడీ చెప్పిందే వేదం... శిలాశాసనం...
     మోడీ సారధ్యంలో అమిత్ షా వ్యూహకర్తగా శ్రీరాముడు అశ్వమేధయాగం చేసి రాజ్యాలనన్నిటిని జయించుకుంటూ పోయినట్టు... ఉత్తరాది నుంచి...ఈశాన్యం మీదుగా దక్షిణాదికి దండెత్తి వస్తున్నారు... కానీ నాడు అలెగ్జాండర్ విజయానికి అడ్డుపడిన పురుషోత్తముడిలా... కర్ణాటకలో మోడీ విజయానికి కుమారస్వామి అడ్డుపడ్డాడు... బెంగళూర్ వేదికగా మోడీ వ్యతిరేక గళాలన్నీ ఒక్క చోట చేరాయి. పరస్పర ఆలింగనాలూ...అభినందనలతో తామంతా ఒక్కటే అనే సందేశాన్ని ఇచ్చాయి. 
    కానీ... నాడు కాంగ్రెస్ ను ఓడించడానికి పరస్పర విరుద్ధమైన భావాలు కల జనసంఘ్, సోషలిస్టులు కలసి జనతా పార్టీ పేరుతొ చేసిన ప్రయోగం 1977 ఎన్నికల్లో గెలిచి మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి అయినప్పటికీ,, ఆ కలగూర గంప ప్రయోగం మూడేళ్లకే విఫలమైనది. అప్పుడు దేశంలో ప్రధానంగా ఉన్న ప్రతిపక్షాలు జనసంఘ్, సోషలిస్టులు, కమ్యూనిస్టులే... ప్రాంతీయ పార్టీలు ఒక్క తమిళనాడు, జమ్మూ కశ్మిర్ తప్ప మరెక్కడా బలంగా లేవు.. 40 ఏళ్ల తర్వాత చూస్తే.. ఇప్పుడు దేశంలో దాదాపు 15 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం రెండు, మూడు రాష్ట్రాలకు పరిమితమై ఒక ప్రాంతీయ పార్టీ స్థితికి దిగజారిపోయింది. ఈ పార్టీలలో కూడా ఒక దానికి ఇంకో దానికి పడదు... నాడు బలంగా ఉన్న కాంగ్రెస్ను ఓడించడానికి విపక్షాలు ఏకమైనట్టు... నేడు బలంగా ఉన్న బి.జె,పీ ని ఓడించడానికి కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే నాటికి నేటికీ చాలా వ్యత్యాసం ఉంది.
    నాడు ఎన్ని విభేదాలున్నా అన్నీ జనతా పార్టీ పేరుతొ ఒకే పార్టీగా ముందుకొచ్చాయి. పైగా ఆ పార్టీని నడిపించడానికి జయప్రకాష్ నారాయణ్(సీనియర్) లాంటి నాయకుడున్నాడు... నేడు ఏ పార్టీకి ఆ పార్టీ తమ స్వతంత్రతను కోల్పోవడానికి ఇష్టపడే స్థితిలో లేదు. అవసరార్ధం  పొత్తులు పెట్టుకుంటాయి కానీ...విలీనం కావడానికి ఎవరూ అంగీకరించరు. ఎవరికి  వారే గొప్ప అన్నట్టుగా... ఆయా రాష్ట్రాల్లో వారికి అధికారం తెచ్చిపెట్టిన అహం అడ్డొస్తుంది. ఇలాంటి స్థితిలో ఈ కలగూర గంప  ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందనేది ప్రశ్నర్థకం. అయినా మతతత్వ బి.జె.పీ ని ఓడించడానికి సెక్యూలర్ పార్టీలు చేసే   ప్రతి ప్రయత్నానికి ఈ దేశంలో సామ్యవాదులందరు తప్పనిసరిగా  మద్దతు ఇవ్వలసిందే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కలగూర గంప ప్రయోగాలు ఫలించేనా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top