Translate

  • Latest News

    8, ఆగస్టు 2018, బుధవారం

    అస్తమించిన ద్రవిడ సూర్యుడు


    ఉదయించే సూర్యుడిని తన పార్టీ  గుర్తుగా పెట్టుకున్న ఆ ద్రవిడ సూర్యుడు తన 94 వ ఏట అస్తమించాడు. అయన రికార్డు భారత దేశ చరిత్రలో ఇంకెవరూ బద్దలు కొట్టలేరు... ఎందుకంటే... ఏ రాజకీయ నాయకుడు తొమ్మిది పదుల వయసు దాటి బతకడం కష్టం. బతికినా... చివరి వరకూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం కష్టం... 13 సార్లు ఎం.ఎల్.ఏ గా గెలవడం కష్టం... అదీ ఓటమి ఎరుగని ధీరుడుగా... ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేయడం... ఈ రికార్డు ఇప్పట్లో సచిన్ సెంచరీల రికార్డు లా అలా ఉండిపోతుంది... ఇంకా క్రికెట్లో కోహ్లీ లాంటి వాడు మన కళ్ళ ముందు కనపడుతున్నాడు ఆ రికార్డు బ్రేక్ చేయడానికి... రాజకీయాల్లో మాత్రం...దరిదాపుల్లో ఎవరూ కనపడడం లేదు.
    తమిళనాట పెరియార్ రూపొందించిన ద్రవిడ ఉద్యమం లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమ నెలబాలుడు దక్షిణామూర్తి...అలియాస్ కరుణానిధి. నాస్తికత్వం, హేతువాదం పునాదిగా నిర్మితమైన ద్రవిడ ఉద్యమం ద్రవిడ కజగం పార్టీగా రూపాంతరం చెందాక  నాటక రచయితగా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న కరుణానిధి డి.కె పార్టీలో చేరి, తన కలంతో ఆ పార్టీకి నూతనోత్తేజాన్ని ఇచ్చారు. ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో పేరులో దేవుడి పేరు (దక్షిణామూర్తి) త్యజించి, తన పేరును కరుణానిధిగా మార్చుకున్నాడు. డి.కె నుంచి అన్నాదురై విడిపోయి డి.ఎం.కె పార్టీ పెట్టినపుడు కరుణానిధి ఆయన వెంట నడిచారు. అదే సమయంలో ప్రముఖ తమిళ హీరో ఎం.జి.ఆర్ కూడా ఆ పార్టీలో చేరారు. అన్నాదురై కు ఇద్దరు చెరో భుజంలా పనిచేశారు. అన్నాదురై మరణానంతరం 1969 నుంచి ఇప్పటివరకు 50 ఏళ్ళు డి.ఎం.కె పార్టీ కి కరుణానిధి అధ్యక్షుడిగా కొనసాగారు. 80 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 60 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నారు. దాదాపు 50 ఏళ్ల పైగా  ఆ నల్ల కళ్ళద్దాల మాటు నుంచే తమిళ రాజకీయాల్ని శాసించారు. 70 వ దశకంలో తన సహచరుడు ఎం.జి.ఆర్ తన నుంచి విడిపోయి అన్నాదురై పేరుతొ అన్నా డి.ఎం.కె అని పార్టీ పెట్టుకున్నాడు..ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి తమిళ రాజకీయం అంతా వారిద్దరి మధ్యే నడిచింది. ఎం.జి.ఆర్ మరణానంతరం ఆయన స్థానాన్ని ఆక్రమించిన జయలలిత కరుణానిధికి ప్రధాన ప్రత్యర్థి అయ్యారు. గత ఏడాది జయలలిత మరణానంతరం ఆ పార్టీలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడు కరుణానిధి మరణంతో తమిళ రాజకీయాల్లోనే శూన్యత ఏర్పడింది. ఆఫ్ కోర్స్ డి.ఎం.కె కు వారసుడు స్టాలిన్ ఉన్నాడనుకోండి... అయినా మేరునగధీరుల్లాంటి రాజకీయ నాయకులు లేరనే చెప్పాలి. తాజాగా సినీ నటులు కమల హాసన్, రజని కాంత్ రాజకీయ పార్టీలు పెట్టినా  వీరు తమిళ రాజకీయాల్లో కరుణానిధి, ఎం.జి.ఆర్ ల స్థాయికి చేరలేరు. ఎందుకంటే... వారు  ఒక సాంస్కృతిక  ఉద్యమం లోంచి పుట్టిన నెలబాలుళ్లు...ఉదయించే సూర్యుళ్లు...   వీరు కేవలం సినిమా క్రేజ్ నుంచి పుట్టిన మిణుగురు పురుగుల లాంటి వారు మాత్రమే.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అస్తమించిన ద్రవిడ సూర్యుడు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top