Translate

  • Latest News

    17, ఆగస్టు 2018, శుక్రవారం

    తొలి తరం రాజకీయ నాయకుల శకం ముగిసినట్టే...


    కొందరు నాయకులు వారు ఏ పార్టీలో ఉన్నా వారి వ్యక్తిత్వ సుగంధంతో పరిసరాలను పరిమళభరితం చేస్తారు. వారు తాము నమ్మిన వాదానికి కట్టుబడినా, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయాల్లో ఒక వేళ తమ వర్గీయులు తప్పు చేసినా ఖండించడానికి ఏ మాత్రం వెనుకాడరు. అందుకే వారు రాజకీయాలకతీతముగా అన్ని పార్టీలతో కొనియాడబడతారు. భారత దేశ మొట్టమొదటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన పుచ్చలపల్లి సుందరయ్య తన నిరాడంబరతతో కమ్యూనిస్ట్ గాంధీగా పేరొందారు. అలాగే ప్రముఖ నాస్తిక వాది  గోపరాజు రామచంద్ర రావు (గోరా), ఆధ్యాత్మిక వాది  అయిన మహాత్మా గాంధీ ల మధ్య మంచి స్నేహ పూరిత సంబంధాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రిగా చేసిన పాములపర్తి వెంకట నరసింహారావు(పి.వి.నరసింహారావు), బి.జె.పీ నాయకుడు వాజపేయి ల మధ్య సైతం మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. వీరిద్దరూ స్వతహాగా సాహిత్యకారులు కావడం అందుకు ప్రధాన కారణం. అయితే ఈ స్నేహమే పీ.వీ కొంప ముంచింది. వాజపేయి తో ఉన్న స్నేహం కారణంగానే 1992 లో బాబరీ మసీద్ కూల్చివేత లో మౌన ముద్రతో వారికి పరోక్షంగా సహకరించారనే  అపవాదు ఆయన రాజకీయ జీవితంపై మాయని మచ్చగా మిగిలిపోయింది. రాజకీయం, సాహిత్యం... రెండూ పూర్తిగా విభిన్న రంగాలు. ఈ రెండిటిలో ప్రవేశము ఉండి రెండింటిలోనూ రాణించిన  వ్యక్తులు దేశ రాజకీయాల్లో చాలా అరుదు. మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ ఫ్రొం ఏ  ఫాదర్ టు హిస్ డాటర్   వంటి గ్రంధాల ద్వారా రచయితగా గుర్తింపు ఉన్నా... ఆయన రాజకీయ నాయకుడిగానే మనందరికీ పాపులర్. అయితే అటు రాజకీయాల్లోనూ, ఇటు సాహిత్యంలోనూ లబ్దప్రతిష్టులుగా గుర్తింపు పొందిన ఘనత మన పీ.వీ కి, వాజపేయికి, మొన్న మరణించిన కరుణానిధికి మాత్రమే ఉంది. వీరిలో వాజపేయ్, కరుణానిధి 90 ఏళ్లకు పైగా జీవించినా  తమ జీవిత చరమాంకంలో ఎక్కువ భాగం చక్రాల కుర్చికే పరిమితమై ఉండిపోయారు. వాజపేయ్ అయితే చాలా కాలంగా మన స్పృహలోనే లేరు. ఆఖరకు మోడీ ప్రధాన మంత్రి అయ్యాక ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించి అది ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన చేతిలో పెట్టి రావలసి వచ్చింది. మొన్న కరుణానిధి, నిన్న వాజపేయి మృతితో  మన దేశ స్వాతంత్ర్యానంతర తొలి తరం రాజకీయ నాయకుల శకం దాదాపుగా  ముగిసినట్టే. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తొలి తరం రాజకీయ నాయకుల శకం ముగిసినట్టే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top