చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అవతలివారి కాళ్లకు ముందరి బంధాలు వేసేలా రాజుకు చెక్ పెట్టి, అష్ట దిగ్బంధనం చేస్తుంటారు. రాజకీయం కూడా చదరంగం లాంటిదే... అందుకే రాజకీయ చదరంగం అని అంటుంటారు. ఇక్కడ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అవతలి పార్టీ వారికి చెక్ పెడుతుంటారు. ఒక్కొక్కప్పుడు పరిస్థితులను బట్టి సొంత పార్టీ లోని వారే... తమ పార్టీ అధినేతకు చెక్ పెడుతుంటారు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి దానిని వెన్నుపోటు అని కూడా అంటారనుకోండి. 1984 లో తెలుగుదేశం పార్టీలో ఎన్.టి.ఆర్ వైద్యానికి అమెరికా వెళ్ళినపుడు నాదెండ్ల భాస్కర రావు ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేసి నెల రోజులు ముఖ్యమంత్రి కాగలిగాడు. వెన్నుపోటుకు సరైన కారణం చూపించలేకపోవడంతో నాదెండ్ల విఫలుడయ్యాడు. కానీ 11 ఏళ్ల తర్వాత 1995 లో లక్ష్మి పార్వతి అనే కారణం చూపించి, పార్టీ వారిని, ప్రజలను కూడా తన మీడియా మిత్రుల సహకారంతో ఒప్పించి, నమ్మించి.. ఎన్.టి.ఆర్ కు ఆయన అల్లుడు చంద్రబాబు విజయవంతంగా చెక్ పెట్టి పార్టీలో ఎన్.టి.ఆర్ స్థానాన్ని శాశ్వతంగా ఆక్రమించాడు. ఇప్పుడు అదే పార్టీలో చంద్రబాబుకు ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీలో సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు , కే ఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ బూచి చూపించి తమ బహిరంగ నిరసన ద్వారా ఒక రకంగా చెక్ పెట్టారు. వాళ్లిద్దరూ చిన్న పిల్లలేమీ కాదు. పైగా వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడాను... చంద్రబాబు బలాబలాల గురించి బాగా తెలిసినవారే.. చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడడమంటే ఆయనను వ్యతిరేకించినట్టే అని వారికి బాగా తెలుసు. అయినా విలేకరుల సమావేశంలో అంత నిక్కచ్చిగా తమ అభిప్రాయాలు చెప్పారంటే చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చినట్టే... మంత్రుల కౌంటర్ కు చంద్రబాబు వెంటనే కౌంటర్ చెక్ ఇస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆయన కౌంటర్ చెక్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే ఈ ఇద్దరు మంత్రులకు సపోర్టుగా మరికొందరు మంత్రులు, నాయకులు గొంతు సవరించుకునే ప్రమాదం కూడా ఉంది. అది క్రమేణా పార్టీలో మరో వెన్నుపోటుకు దారి తీయవచ్చు. సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కొంటాడన్న పేరున్న చంద్రబాబు పార్టీలో ఈ అంతర్గత సమస్యను ఎలా టాకిల్ చేస్తాడో చూద్దాం
24, ఆగస్టు 2018, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి