Translate

  • Latest News

    24, అక్టోబర్ 2018, బుధవారం

    నిప్పులాంటి మహిళా అధికారి కూడా...


    పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పడు శవం లోని బేతాళుడు రాజా... ప్రస్తుత కలికాలం లో నిప్పు కు కూడా చెదలు పడుతున్నాయి... కావాలంటే నీకు అందుకు నిదర్శనంగా ఓ కథ చెబుతాను... విను.. అంటూ చెప్పసాగాడు. 
    అంధ దేశంలో చంద్రగిరి  నాయుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఆర్ధిక శాస్త్రంలో పెద్ద పెద్ద చదువులు చదివాడు. అందుకే ఆయన దేన్నయినా మనకేంటి లాభం అంటూ వాణిజ్య దృక్పథంతోనే చూసేవాడు.  అంతేకాదు తనకు అనుకూలంగా వ్యక్తులను అయినా... వ్యవస్థలను అయినా మేనేజ్ చేయడంలో ప్రపంచంలోనే ఆయనకు సాటి మరెవరూ లేరని ప్రతీతి. అయితే ఆ రాజ్యంలో ఒక మహిళా అధికారి ఉండేవారు. ఆవిడ పేరు పూనమ్మ.  ఆవిడ నీతికి, నిజాయితీ కి మారుపేరు. నీతి  తప్పితే రాజుగారి ముఖ్య అనుచరులను కూడా లెక్కచేసేది కాదు. కొద్దికాలం కిందట ఆవిడను  ఆరోగ్య శాఖకు మార్చారు. అప్పటి నుంచి నిప్పుకు   చెదలు పట్టాయని రాజ్యంలో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. 
    ఆరోగ్య శాఖలో అసలేం జరుగుతోంది..? ఎందుకు ఆ శాఖలో అధికారులు ఇమడలేక పోతున్నారు. ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు... ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక సెలవులు పెట్టి ఎందుకు వెళ్లిపోతున్నారు...గతంలో ముగ్గురు ఐ.ఏ.ఎస్ అధికారులు ఆ శాఖను వదిలి వెళ్లిపోయారు. తాజాగా మరో అధికారి  అదే బాటలో నడిచారు. పైగా ఈయన కేవలం 7 రోజులు మాత్రమే ఆ స్థానంలో పనిచేయడం గమనార్హం. ఇంతలోనే ఆయన అంత ఒత్తిడికి గురయ్యారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  సీన్ కట్ చేస్తే... సెలవు పెట్టిన ఆ అధికారిని ఓ జిల్లాకు బదిలీ చేస్తూ రాజ్యం ఉత్తర్వులు జారీ చేసింది.   మొత్తంమీద ఆరోగ్య శాఖకు ఏ అధికారి రావాలన్నా అవినీతి ఫైళ్లపై సంతకాలు చేయవలసి వస్తుందని భయపడుతున్నారు.
    ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా ఉన్న మహిళా అధికారి  రాజ్యంలో  రాజకీయ నాయకులను గడగడ లాడించి, వారికి సింహస్వప్నం లా  నిలిచిన నిప్పు లాంటి అధికారిణి. మరిప్పుడెందుకిలా మారిపోయింది. వీటన్నిటికీ సమాధానాలు తెలిసి చెప్పకపోయావో నీ తల  వేయి వక్కలవుతుంది అంటూ బేతాళుడు విక్రమార్కుడుని  హెచ్చరించాడు. 
    అంతట విక్రమార్కుడు  బేతాళుడికి బదులిస్తూ... ఆమె నిన్నటి వరకు నిప్పుగా ఉన్న మాట నిజమే... కానీ అంధ రాజ్య పాలకుడు అయినా చంద్రగిరి  నాయుడు తాను  పైకి నిప్పు అని చెబుతూ తెర వెనుక  భయంకరమైన అవినీతి సామ్రాజ్యాన్ని తన చేతికి మట్టి అంటకుండా పాలిస్తుంటాడు. నిప్పు లాంటి అధికారులను కూడా ఎలా లొంగదీసుకోవాలో... ఎలా మానేజ్ చేయాలో బాగా తెలుసు. అందుకే ఆ నిప్పు లాంటి మహిళా అధికారి భర్త కొండల య్యను   రాజ్యంలో రక్షక దళానికి ప్రధాన అధికారిగా చేశాడు. అంతే  దెబ్బకు నిప్పు కూడా నీరుగారిపోయింది. నిప్పుకు  చెదలు పట్టాయి. ఇక అప్పటినుంచి పూనమ్మ రాజుగారు చెప్పినట్టల్లా ఆడుతోంది.  అయినా ప్రకృతిని, సముద్రాన్ని కూడా మానేజ్ చేయగల దిట్ట అయిన రాజుగారికి ఆఫ్ట్రాల్ ఒక అధికారి... అందునా మహిళా అధికారిని మానేజ్ చేయడం ఒక లెక్కా.. అని చెప్పి విక్రమార్కుడు ముగించాడు. 
    రాజుకు ఈ విధంగా మౌన భంగం కలగ గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నిప్పులాంటి మహిళా అధికారి కూడా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top