Translate

  • Latest News

    5, అక్టోబర్ 2018, శుక్రవారం

    చంద్రబాబు ఇందిర తోనూ పోరాడాడంట...


    మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తో పోరాడాడంట... ఆయన గారు చెబుతున్నారు... మనం వినాలి... తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను ఇందిర తోనే పోరాడా... మోడీ ఎంత... అని అన్నారు. ఏదో నిన్న గాక మొన్న పుట్టిన వాళ్లయితే ఆయన ఏది చెప్పినా నమ్మేస్తారేమో కానీ..మన కళ్ళ ముందు జరిగిన చరిత్రను కూడా ఇలా ఏ మాత్రం తడుముకోకుండా వక్రీకరించి చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసింది యువజన కాంగ్రెస్ నాయకుడిగా... చిన్న వయసులోనే ప్రస్తుత ఎం.పీ గల్లా జయదేవ్ తాతగారు, గల్లా రాజగోపాల నాయుడు రికమండేషన్ తో 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.ఎల్.ఏ టికెట్ పొంది ఎం.ఎల్.ఏ గా గెలిచారు. అది కూడా అప్పటి పరిస్థితి ఏమిటి... ఎమర్జెన్సీ అనంతరం కేంద్రంలో 1977 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిర చిత్తుగా ఓడిపోయింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా  ఉన్న మన తెలుగువాడైన కాసు బ్రహ్మానంద రెడ్డి   ఇందిరా గాంధీని  పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆమె బయటకు వచ్చి ఇందిరా కాంగ్రెస్ అని సొంత పార్టీ పెట్టుకుంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇందిర తన బలం నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. ఇక్కడ పట్టు సంపాదించి, బ్రహ్మానంద రెడ్డిని దెబ్బ కొట్టాలి. ఆ తరువాత కేంద్రంలో మళ్ళీ పట్టు సాధించాలి. రాష్ట్రంలో చెన్నారెడ్డి ఆమెకు అండగా నిలిచారు. ఇక 294 స్థానాలకు అభ్యర్థులను వెతకాలి. అయితే ఆంధ్ర ప్రాంతంలో హేమాహేమీ నాయకులంతా రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల ఇందిరా కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. కృష్ణా జిల్ల్లా లో అయితే ఆ ఎన్నికల్లో తిరువూరు ఎస్.సి రిజర్వ్ డు నియోజకవర్గంలో అభ్యర్థి దొరక్క వక్కలగడ్డ ఆదాం అనే ఒక ట్రక్కు డ్రైవర్ కు టిక్కెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో ఇందిర ప్రభంజనంలో ఆయన కూడా గెలిచేసి ఎం.ఎల్.ఏ అయిపోయారు. ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో వక్కలగడ్డ ఆదాం కధ గొప్ప వింతగా చెప్పుకునేవారు. అలాంటి రోజుల్లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం వెతుకుతున్న రోజుల్లో రాష్ట్రంలో రెడ్డి కాంగ్రెస్ లోనే పెద్ద పెద్ద రెడ్డి నాయకులతో పాటు కృష్ణా జిల్లాలో కమ్మ వర్గానికి చెందిన పెద్ద నాయకులైన పిన్నమనేని కోటేశ్వర రావు, చనుమోలు వెంకట్రావు, కాపు వర్గానికి చెందిన మండలి వెంకట కృష్ణారావు కూడా రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. కమ్మ వర్గంలో అప్పుడపుడే రాజకీయాల్లోకి వస్తున్న నాదెండ్ల భాస్కర రావు విజయవాడ తూరుపు నియోజకవర్గం నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎం.ఎల్.ఏ గా  గెలిచారు. అలాగే చిత్తూరు జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున టిక్కెట్ ఇస్తే ఆయన గెలిచి ఎం.ఎల్.ఏ అయ్యారు. రాష్ట్రంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రెండేళ్లు సి.ఎం గా చేశాక కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను దించేసి టంగుటూరి అంజయ్యను ముఖ్యమంత్రిని చేసింది. అంజయ్య ఎం.ఎల్.ఏ లలో అసంతృప్తిని చల్లార్చడానికి అడిగిన వారికి,,, అడగని వారికి అందరికి మంత్రి పదవులు పందేరంలా పంచేశారు. అప్పట్లో పత్రికలన్నీ అంజయ్య కేబినెట్ ను  జంబోజెట్ కేబినెట్ అని అభివర్ణించాయి. ఆయన మంత్రివర్గంలో 63 మంది మంత్రుల్లో చంద్రబాబుకు కూడా మంత్రిగా స్థానం దక్కి మంత్రి అయ్యారు. ఆలా చంద్రబాబు మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా ఉండగానే ఎన్ టి.ఆర్ కు అల్లుడు అయ్యారు. ఆ తర్వాత మామ ఎన్ టి.ఆర్ 1982 లో తెలుగుదేశం పార్టీ పెట్టినా చంద్రబాబు కాంగ్రెస్ లోనే ఇందిరా విధేయుడిగా ఉన్నారు. పైగా 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే మామ ఎన్ టి.ఆర్ పై అయినా పోటీ చేస్తా అని డంబాలు పలికారు. చంద్రగిరి నుంచే కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఎన్ టి.ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గప్ చిప్ గా వచ్చి మామ పక్కన చేరారు. అయినా ఎన్ టి.ఆర్ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు సందర్భంగా ఎన్ టి.ఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పిలుపును అందుకుని రాష్ట్రం మొత్తం ఉద్యమించి స్తంభిపచేస్తే ఇందిర దిగి వచ్చి ఎన్ టి.ఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసింది. ఆ క్రెడిట్ అంతా ఎన్ టి.ఆర్ దే. దానిని  కూడా చంద్రబాబు తన క్రెడిట్ గా చెప్పుకుని ఇందిర తో పోరాడాను అంటే నవ్వుతారు. ఆ తర్వాత రెండు నెలలకే ఇందిర హత్య జరిగింది. ఇంకా చంద్రబాబు ఇందిర తో ఎప్పుడు పోరాడాడు... పార్టీ ఆదేశిస్తే మామ పై కూడా పోటీచేస్తా అని ఆమెకు సాగిల పడ్డాడు కానీ. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబు ఇందిర తోనూ పోరాడాడంట... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top