Translate

  • Latest News

    1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

    ఓట‌ర్ల‌కు ఇలా గాలం వేస్తున్నారా...?


    ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం.  అన్ని పార్టీల‌కు ఓట‌రే దేవుడు. త‌మ భ‌విష్య‌త్తు త‌ల‌రాత‌ను నిర్దేశించే  ఓట‌రు దేవుడి కోసం అన్ని పార్టీలు గాలం వేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీల‌కు ఒక వెసులుబాటు ఉంటుంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏవైతే చేస్తామ‌ని హామీలు ఇస్తాయో వాటిని  రోజుల వ్య‌వ‌ధిలోనే అమ‌లులోకి తీసుకువ‌చ్చే అవకాశం ఉంది.  కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే త‌ర‌హా వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. రైతుల‌ను ఆదుకోవటానికి కొన్ని రాష్ట్రాల్లో  అమ‌లులో ఉన్న, ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చిన రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్ట‌నుంది. చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఉన్న ఏపీ ప్ర‌భుత్వం రెండు ఆకులు ఎక్కువే చ‌దివింది. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్న హామీల్లో పింఛన్ల  పెంపును అమ‌లు చేసేసింది. మ‌హిళ‌ల‌కు సెల్‌ఫోన్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి , డ్వాక్రా మ‌హిళ‌లకు రూ.10 వేలు స‌హాయం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే బాబు ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా పోస్టు పెయిడ్ చెక్కులు అంద‌జేయ‌టం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. మ‌రోవైపు యువ‌త కోసం నిరుద్యోగ భృతిని వెయ్యి నుంచి రూ.2వేలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల బ‌డ్జెట్‌లు కూడా పూర్తిగా ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను గాలం వేసే విధంగా మారిపోయాయి.

    ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా ఎన్నిక‌లంటేనే డ‌బ్బుల‌తో ముడిప‌డ్డ అంశం. ఓట‌రును ఎలా ఆక‌ర్షించాల‌న్న విష‌యంపైనే పార్టీలు దృష్టి సారించాయి. ఇక్క‌డ విలువ‌లు, నైతిక‌త‌తో సంబంధం లేదు. ఎలాగైనా గెల‌వ‌ట‌మే అంతిమ ల‌క్ష్యం. ఇందుకు ఎంత‌కు దిగ‌జారాలో అంత‌గా దిగ‌జారుతున్నాయి. ఓట‌రును  ప్ర‌లోభాల‌కు గురి చేయ‌టానికి కులాల మ‌ధ్య‌, మ‌తాల మ‌ధ్య చిచ్చురాజేస్తున్నాయి. అల‌నాడు ఎస్సీల మ‌ధ్య చంద్ర‌బాబు రాజేసిన చిచ్చు ఇంకా కొన‌సాగుతునే ఉంది. బీసీల  మ‌ధ్య, ఓ బీసీల మ‌ధ్య చిచ్చు పెట్టి ల‌బ్ది పొందాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. కేంద్రం ప్ర‌క‌టించిన ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు అంశాన్ని కూడా రాజ‌కీయంగా వాడుకోవ‌టానికి ప్రాధాన్యత  ఇస్తున్నారు. ఈ రిజ‌ర్వేష‌న్‌లో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు కాపుల‌కు ఇస్తున్న‌ట్లు బాబు ప్ర‌క‌టించ‌టం ఎన్నిక‌ల వ్యూహంలో భాగమే. ఇప్ప‌టికే ఆయా కులాల మ‌ధ్య  చిచ్చు కొన‌సాగుతోంది. మ‌రో వైపు ఏ కులానికి ఆ కులాల‌కు ప్ర‌త్యేక తాయిలాలు అమ‌లు చేస్తున్న‌ట్లు రాజ‌కీయ పార్టీలు ప్ర‌క‌టిస్తున్నాయి. 

    విజ్ఞులైన ఓట‌ర్లు ఇప్పుడే స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణ‌యంపైనే రానున్న ఐదు సంవ‌త్స‌రాలు మ‌న భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని గ‌మ‌నించాలి. ప్ర‌తిప‌క్షం, అధికారం ప‌క్షం ఏ పార్టీ అయినా వీరంతా ప్ర‌జ‌ల‌ను ఉద్ద‌రించ‌టానికి, ప్ర‌జా సేవ చేయ‌టానికే వ‌స్తున్నారా..? మ‌న ఓట్ల‌తో గెలిచి, ఓట్ల కోసం పెట్టుబ‌డి పెట్టి అక్ర‌మ వ్యాపారం చేయ‌నున్నారా..?  నాయ‌కుడు ఎవ‌రైనా నిజంగా భ‌విష్య‌త్తులో ప్ర‌జ‌ల ప‌క్షం నిలుస్తారా... గ‌త ఐదు సంవ‌త్స‌రాల కాలంలో గుర్తుకు రాని ప్ర‌జా స‌మ‌స్య‌లు, వారి క‌ష్టాలు ఇప్ప‌డే ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌తిప‌క్షానికి ఎందుకు గుర్తుకువ‌స్తున్నాయి.,?  రేపు మ‌న‌వైపు, మ‌న కోసం నిల‌బ‌డే నాయ‌కుడు ఎవ‌రు.. ? అనేది ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఓట‌ర్ల‌కు ఇలా గాలం వేస్తున్నారా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top