Translate

  • Latest News

    2, ఫిబ్రవరి 2019, శనివారం

    చెంప దెబ్బ కొట్టి సవరదీసినట్టు...





    ఇప్పుడు ఎన్నిక‌ల ట్రెండ్ మారింది. ప్ర‌జ‌ల సొమ్ముతో నిర్ల‌జ్జ‌గా అధికార పార్టీలు వివిధ ప‌థ‌కాల పేర్ల‌తో ఓట్ల  కొనుగోలుకు పాల్ప‌డుతున్నారు. ప‌థ‌కం ఏదైనా ఎన్నిక‌ల ముందు అప్ప‌టిక‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే విధంగా ప‌థ‌కాలు ఏర్పాటు చేస్తున్నారు.  మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇదే జ‌రిగింది. ఇప్పుడు కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ వ్య‌వ‌హారాన్ని ఫాలో అవుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి కేవ‌లం నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కాని ఈ స‌మ‌యాన్ని కూడా ఎన్నిక‌ల తాయిలాలు అందించ‌టానికి బ‌డ్జెట్ రూపంలో ప్ర‌య‌త్నం జ‌రిగింది. 

    బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌ల న‌డ్డి విరిచే చ‌ర్య‌లే చేప‌ట్టారు. నోట్ల ర‌ద్దు విష‌యంలో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ప‌డ్డ క‌ష్టాలు అంతా ఇంతా కాదు. జీఎస్టీ పేరుతో మ‌రో అయోమ‌యానికి తెర‌తీశారు. ఈ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఎన్న‌డూ  లేని విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన రైతులు త‌మ స‌మ‌స్య‌ల సాధ‌న కోసం రోడ్లెక్కారు. న‌ల్ల‌ధ‌నం వెనక్కు తెప్పించే మాట ఏమో కాని న‌ల్ల కుబేరులు దేశం దాటి వెళ్లిపోయారు. వంట‌గ్యాసు, పెట్రో ధ‌ర‌లు ఆకాశానికి ఎగ‌బాకాయి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. ఇందుకు త‌గ్గ‌ట్లే వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ, ఇటీవ‌ల విడుద‌ల చేసిన స‌ర్వేల‌లో బీజేపీ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడ‌వ‌టానికి , నాలుగు సంవ‌త్స‌రాల త‌ప్పులు స‌రిచేసుకోవ‌టానికి అన్న‌ట్లు...  చెంప దెబ్బ కొట్టి సవరదీసినట్టు... ఈ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. 

    స‌హ‌జంగా ఎన్నిక‌ల బ‌డ్జెట్ కాబ‌ట్టి బ‌డ్జెట్ జ‌న‌రంజ‌కంగా ఉంది. ప్ర‌జ‌ల నుంచి కూడా సానుకూల స్పంద‌న క‌నిపించింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లను టార్గెట్ చేస్తూ ఆదాయ‌ ప‌రిమితిని రూ.5లక్ష‌లు పెంచారు. రైతులకు ఏడాదికి రూ. 6వేల స‌హాయం నేరుగా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌కు ముందే ఓబీసీ ఓట్ల కోసం 10 శాతం రిజ‌ర్వేష‌న్ల నిర్ణ‌యం తీసుకొన్న మోడి స‌ర్కార్ ఇప్పుడు  ఆదాయ‌ప‌రిమితిని పెంచి వారికి ఈబీసీ రిజర్వేషన్లు వర్తించేందుకు తన వంతు దోహదపడ్డారు.  అయితే ఈ ఎన్నిక‌ల బ‌డ్జెట్‌తో ఓట‌ర్ల మ‌న‌స్సులు బీజేపీ గెలుస్తుందా.. ఎన్నిక‌ల తాయిలాలు ప్రజ‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయా అంటే కష్ట‌మే. ప‌థ‌కం వేరు.. దాని  అమ‌లు వేరు. ఈ ప‌థ‌కాల‌న్నీ గ‌త బ‌డ్జెట్‌ల‌లో ప్ర‌వేశ‌పెట్టి ఉంటే  అమ‌లులో ఉండే క‌ష్ట‌న‌ష్టాలు బ‌య‌ట‌ప‌డేవి. కాని ప్ర‌క‌టించిన ప‌థకాలు ప్ర‌జ‌ల‌కు చేరే లోగా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చేస్తుంది.  ఒక‌వేళ రైతుల‌కు మొద‌టి విడ‌త‌గా రూ. 2వేలు రైతుల ఖాతాల్లో వేసినా అవి రైతుల‌కు అందే అవ‌కాశం కూడా లేదు. ఏపీ లాంటి రాష్ట్రాల‌లో రుణ‌మాఫీ కాక‌, వ‌డ్డీలు పెరిగిపోయాయి. ఈ  క్ర‌మంలో రైతుల ఖాతాల్లో న‌గ‌దు ప‌డినా వెంట‌నే బ్యాంకు అధికారులు జ‌మ‌చేసుకుంటారు. మొత్తం మీద ఎన్నిక‌ల తాయిలాలు బీజేపీని గ‌ట్టెక్కిస్తాయా...అన్న‌ది నేటి ప్ర‌శ్న‌. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చెంప దెబ్బ కొట్టి సవరదీసినట్టు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top