ప్రజలను మభ్యపెట్టడం.. ఏదో జరుగుతోందని ఆర్బాటం చేయటం చివరుకు ఏదో రకంగా ఓట్లను వేయించుకోవటం ఇది ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ప్రతి దానికి నిబంధనలు అడ్డువస్తాయి. ప్రచారం కూడా ఎన్నికల ఖర్చులో చేరిపోతుంది. ఇందుకు ముందే ప్రజల ఖర్చుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గతంనుంచే తన అనుకూల మీడియా ద్వారా ప్రచారాన్ని ప్రారంభించిన బాబు ఇప్పడు దీన్ని విస్తృతం చేస్తున్నారు.
మొదటి నుంచి బాబు గారి పాలసీ పావలా పని చేసి రూపాయి ప్రచారం పొందటం. దీన్ని ప్రతి సందర్బంలో సమర్ధవంతంగా వాడుకోగల నేర్పరి కనుకనే రాష్ట్రంలో పలు విపత్కర పరిస్థితులను సైతం ఆయన తనకు అనుకూల ప్రచారానికే వాడుకున్నారు. ఉదాహరణకు తుఫానులు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న వారు ఎవరైనా ఏం చేస్తారు. బాధితులను ఆదుకోవటానికి, వారికి అవసరమైన సహాయ సహకారాలను అందజేయటానికి ప్రయత్నిస్తారు. కాని చంద్రబాబు ఇందుకు విభిన్నం. తుఫాను ప్రకటన వెలువడగానే రాత్రింతా మేలుకొని సమీక్షించినట్లు గడియారంలో సమయం సూచిస్తూ చంద్రబాబు కూర్చొన్న నిలువెత్తు బొమ్మలతో అనుకూల మీడియాతో ప్రచారం ప్రారంభమౌతుంది. ఇక తుపాను వెలిసే వరకు తుఫాను బాధిత ప్రాంతాల కవరేజి వదలి బాబు చుట్టే బాబు మీడియా తిరుగుతుంది. సహాయ చర్యల పర్యవేక్షణ పేరుతో బాబు టీమ్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అధికారులు భాధితుల సహాయ చర్యలు వదలివేసి సీఎం చుట్టూ ప్రదక్షణలు చేయటం, అనంతరం ఆ ఫొటోలతో రాష్ట్రం అంతా ప్రచారం ప్రారంభమవుతుంది. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు అండ్ టీమ్ ప్రచారం మీదే ఆధారపడతారు. ఆశా వర్కర్లు, హోంగార్డులు వేతనాల పెంపు, డ్వాక్రా మహిళలకు సాయం, ఫించన్ల పెంపు ఇలా ఏ పధకం ప్రారంభించినా రెండుమూడు రోజుల పాటు సీఎం సన్మాన కార్యక్రమం, ఫ్లెక్సీలకు పాలాభిషేకం ఇలా రోజుల పాటు ప్రచార ప్రహసనం కొనసాగుతుంది.
రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కప్పి పుచ్చి, ప్రజల సమస్యలను గాలికి వదిలి కేవలం ప్రచార ఆర్బాటాలతోనే ప్రజల మైండ్ సెట్ మారుతుందనుకోవటం భ్రమ మాత్రమే. క్షీణించి శాంతిభద్రతలు, అధికారుల్లో పెరిగిన అలసత్వం, పార్టీ నాయకుల అవినీతి ఇవన్నీ బాబు పాలనపై ప్రభావం చూపిస్తున్నాయి. తనకు తాను సొంత డబ్బా కోట్టుకోవటం, భజన చేసుకోవటంలో చంద్రబాబు ఆరితేరారు. ప్రచార ఆర్బాటాలు కొంతవరకు ప్రజలను ప్రభావితం చేయవచ్చునేమో కాని, కేవలం ప్రచారాలతో ప్రజల మనస్సులను గెలవాలనుకోవటం కల్ల. ఎంతో అనుభవం ఉందని చెప్పుకొనే బాబు ఎన్నికలకు ముందు అయినా ప్రచార యావ నుంచి బయటపడితే కొంత వరకు అయినా ప్రజల మన్ననలు పొందగలగే అవకాశం ఉంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి