Translate

  • Latest News

    20, ఏప్రిల్ 2019, శనివారం

    అమ్మా... మ‌హాసాధ్వి ప్రజ్నా సింగ్ నీ శాపాలు కట్టిపెట్టు



    భార‌త దేశంలో దేశ‌భ‌క్తి కొంద‌రికే ప‌రిమితం. అది కొంద‌రికే పేటెంట్ హ‌క్కు. ఆ పేటెంట్ హ‌క్కు ఉన్న వాళ్లు ఏం మాట్లాడినా దేశ‌భ‌క్తి, దేశ‌భద్ర‌త, దేశ‌ద్రోహం రాజ్యాంగ ఉల్లంఘ‌న కింద రావు. ఇందులో మ‌రీ ముఖ్యం గా కాషాయ  రంగు వేసుకొని,  సాధువులు అంటూ ప్ర‌చారం పొందుతున్న వారు  ఏదైనా మాట్లాడ‌వ‌చ్చు. ఎక్క‌డో ఏదో ఒక విద్యార్ధి సంఘం నేత ఏదో మాట్లాడితే, మ‌రో మైనార్టీ నేత త‌న హ‌క్కుల గురించి ప్ర‌శ్నిస్తే మాత్రం వెంట‌నే దేశ‌ద్రోహం అవుతుంది. భిన్న‌స్వ‌రాలు వినిపించాల్సిన ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో కొంద‌రికే వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. 
    మహారాష్ట్ర, నాసిక్ దగ్గరి మాలేగావ్ వద్ద హమీదియా మసీదు ఆవరణ లోని శ్మశానంలో 08.09.2006 న వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళకు సైకిళ్ళను ఉపయోగించారు. 37 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇదే ప్రదేశంలో భిక్కు చౌక్ ప్రాంతంలో 29.09.2008 న మరోసారి వరుస పేలుళ్ళు జరిగాయి. ఇందులో 6 మంది చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. ఇక్కడ ప్రజ్ఞా సింఘ్ పేరు మీద నమోదయిన మోటర్ సైకిల్ ను వాడారు. దీనిపై హేమంత్ కర్కరే ఆధ్వర్యంలో ఎ.టి.ఎస్. దర్యాప్తును చేపట్టింది. హిందుత్వ శక్తుల ప్రమేయాన్ని నిర్ధారించింది. ప్రజ్ఞా సింఘ్ ఈ మోటర్ సైకిల్ ను వాడలేదని ఎన్.ఐ.ఎ. ఆమెను నేరవిముక్తురాలిని చేసింది. ఇక్క‌డే మ‌రో విష‌యం చెప్పుకోవాలి. 1993 ముంబయి పేలుళ్ళ లో రూబిన మెమన్ పేరు మీద నమోదయిన వాహనాన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణా కు వాడారని అభియోగం. ఈ వాహనాన్ని ఆమె వాడ లేదు. అయినా రూబిన మెమన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2016లో ప్ర‌జ్ఞాసింఘ్‌కు  ఎన్‌ఐఏ క్లీన్‌ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమె ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న భోపాల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పై పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె బీజేపీలో ఉంది. దేశ‌భ‌క్తి పేటెంట్ హ‌క్కు ఉన్న బీజేపీలో చేరింది   కాబ‌ట్టి దేశ‌భ‌క్తురాలే. సందేహం లేదు. ఆమె ఏమైనా మాట్లాడ‌వ‌చ్చు. త‌న జోలికి వ‌చ్చాడు కాబ‌ట్టే , తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారని ప్ర‌జ్ఞాసింఘ్ చెప్పుకొచ్చారు. 
    హేమంత్‌ కర్కరే ఎలా చ‌నిపోయాడు...?
    2008 నవంబర్‌ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిగాయి.  174 మంది  మ‌ర‌ణించారు. ఆ రోజు ఏం జ‌రిగిందేమింటే ముంబై యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) చీఫ్‌ హేమంత్ కర్కరే.  దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్‌ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం!  కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్‌బ్లెస్‌ హాస్పిటల్‌కి మూవ్‌ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్‌బ్లెస్‌కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్‌ క్వాలిస్‌ జీప్‌ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్‌లెస్‌లో ఇన్ఫర్మేషన్‌ రావడంతో అక్కడికి వెళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు. భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్‌ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్‌ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్‌ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని  కవిత ఎప్పుడూ అంటుండేవారు.క‌ర్క‌రే మృతిపై ఇప్ప‌టికి ప‌లు అనుమానాలు ఉన్నా ప్ర‌భుత్వం పూర్తిస్తాయిలో విచార‌ణ జ‌రిపించ‌టంలో విఫ‌ల‌మైంది. ఆ రోజు కర్కారేను కావాలనే ఫోన్ చేసి ఆ స్పాట్ కు రప్పించి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్లో చనిపోయినట్టు చేశారని, మాల్గావ్ పేలుళ్ల వెనుక ఉన్న హిందుత్వ వాదుల కుట్ర బయటకు రాకుండా శాశ్వతంగా కప్పెట్టటానికే ఆలా చేశారనే వాదన ఒకటుంది. దీనిపై ఒక పుస్తకం కూడా వచ్చింది. కావాలంటే who killed karkare అనే పుస్తకంగా చదవండి నిజానిజాలు తెలుస్తాయి. ఈ నేపధ్యంలో స‌న్యాసిని ప్ర‌జ్ఞాసింఘ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అమ్మా మ‌హాస్వాధ్వి ప్రజ్నా సింగ్ నీ శాపాలు కాస్త కట్టిపెట్టు. నీ మీద మాల్గావ్ కేసు ఇంకా కొట్టేయలేదు...నువ్వు కేవలం బెయిల్ మీదే ఉన్నావన్న సంగతి గుర్తెరిగి మాట్లాడు. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అమ్మా... మ‌హాసాధ్వి ప్రజ్నా సింగ్ నీ శాపాలు కట్టిపెట్టు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top