Translate

  • Latest News

    8, జులై 2019, సోమవారం

    కాపు మంత్రం ఏపీలో బీజేపీ తంత్రం


    అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తం దండెత్తుకొచ్చి భారతదేశంలోకి వచ్చినట్టు... ఉత్తర భారతంలో మొత్తం దాదాపుగా జైత్రయాత్ర చేసి తిరుగులేని విజయాలతో సంబరాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాపథం వైపు దృష్టి సారించింది. అందునా ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడానికి పాచికలు పారుతోంది. తెలంగాణలో ఇప్పటికే కొంతవరకు పట్టు సాధించిన బీజేపీ ఆ పట్టు మరింత బిగించేందుకు కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. తద్వారా త్వరలో అక్కడ జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో మెజారిటీ మున్సిపాలిటీలను గెలుచుకుని, పట్టణ ప్రాంతాల్లో ఆధిపత్యం సంపాదించి, టీఆరెస్ కు సవాల్ విసరాలని ప్లాన్ చేస్తోంది. 
    ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... 
    ఇక్కడ ప్రధాన పార్టీలు రెండూ రెండు సామాజికవర్గాలకు ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అపప్రధను మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రధాన సామాజికవర్గమైన కాపులు జనసేన పార్టీ పెట్టుకున్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయడంతో అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఈ విషయాన్ని కాపు నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా పసిగట్టారు... వచ్చే ఎన్నికల్లో ఏపీ లో పాదం మోపాలంటే  బీజేపీ కి కాపు నేతల అండ అవసరం... అలాగే కాపు నేతలకు కూడా బీజేపీ లాంటి పెద్ద పార్టీ అండ అవసరం. ఇద్దరికీ పరస్పర అవసరం ఉన్నందున అమిత్ షా.. గురి కాపు నేతలపై పడింది. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన ఉత్తర ప్రదేశ్ లో ఎస్.పీ, బి.ఎస్.పీ లను మించిన కుల రాజకీయాలు ఆడి అమిత్ షా అక్కడ ఆ రెండు పార్టీలను చావు దెబ్బ కొట్టాడు... అదే సూత్రాన్ని ఏపీ లో కూడా అమలు చేయడానికి సిద్హంగా ఉన్నాడు. ఇక్కడ కమ్మ, రెడ్లు కాకుండా మూడో ప్రధాన సామాజిక వర్గమైన కాపు లను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఏపీ లో పాగా వేయడానికి ప్రణాళిక సిద్ధం అయింది. అయితే అదే సమయంలో కేవలం కాపు ముద్ర పడకుండా ఉండడానికి తెలుగుదేశం నుంచి వీలైనంత మంది కమ్మ, ఇతర కులాల నాయకులను ఆకర్ష్ టీడీపీ ద్వారా చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తానా సభలను కూడా కొంతవరకు ఉపయోగించుకుంటున్నారు. ఎలాగో నాదెండ్ల మనోహర్ పవన్ పక్కనే ఉన్నాడుగా కధ నడిపించడానికి... పనిలో పనిగా వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కర రావును బి.జె.పీ లో చేర్చేశారు. నాదెండ్ల, దగ్గుపాటి కుటుంబాలతో పాటు, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, గరికపాటి మోహనరావు ఎలాగో బి.జె.పీ లో చేరిపోయారు కదా... 
    జనసేనతో  పొత్తు?
    వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైన కాపు నాయకులు ఎలాగో బీజేపీ లో చేరతారు. చేరని వారు జనసేనలో ఉంటారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయి. తానా సభలకు  పవన్  కళ్యాణ్ వెళ్లడం, బీజేపీ వ్యూహకర్త రామ్ మాధవ్ కూడా ఆ సభలకు హాజరవడంపై ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. పైగా  అక్కడ టి.వి. 9 తో మాట్లాడుతూ బి.జె.పీ తో నాకు వ్యక్తిగత గొడవలు ఏమి లేవు... కేవలం ప్రత్యేక హోదా గురించి క్లారిటీ ఇవ్వమని అడిగాను. అయితే తెలంగాణ ఉద్యమంపై అక్కడి జనాల్లో ఉన్న ప్రగాఢ మైన కోరిక ఏపీ లో జనాలకు ప్రత్యేక హోదా పై ఆంధ్రులకు లేదు.. వారిలో లేనిది నేను క్రియేట్ చేయలేను కదా అన్నారు.. అంటే దీని ప్రకారం పవన్ ప్రత్యేక హోదా కాడి పడేసినట్టేనా అనే అనుమానం తలెత్తుతోంది. ఇదంతా రామ్ మాధవ్ తో భేటీ మహాత్యమే అని విమర్శకుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ మరింత నీరుగారిపోతుంది. ఏపీ లో జగన్ కు బీజేపీ జనసేనతో కలిసి సవాల్ విసరనుంది. పవన్ కళ్యాణ్ అనే తురుపు ముక్కతో బీజేపీ జగన్ ను ఢీకొనడానికి వ్యూహం పన్నింది. అమిత్ షా దెబ్బకు తిరుగుండదు అంటారు కదా... మరిక్కడ ఏపీ లో ఆయన ప్లాన్ ఫలిస్తుందో లేదో వేచిచూడాలి మరి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కాపు మంత్రం ఏపీలో బీజేపీ తంత్రం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top