ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను పాలించే నాయకుడి కోసం తీర్పు ఇచ్చిన రోజు. ఇదే రోజు అంటే ఏప్రిల్ 11వ తేదీ 2019లో ప్రజలు సుస్పష్టమైన తమ మనోభావాలను ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేసిన రోజు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబును కాదని, తమ సమస్యలు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి వల్లనే పరిష్కారమౌతాయని ప్రజలు నమ్మిన రోజు. చంద్రబాబును కాదని, జగన్‌ను పట్టం కట్టిన ప్రజలకు ఈ ఏడాది కాలంలో ఎటువంటి సంతృప్తి లభించింది. జగన్‌మోహనరెడ్డి ఏడాది కాలంలో చేపట్టిన సంస్కరణలు ఏమిటి..? అవి సత్ఫలితాలు ఇస్తున్నాయా... ప్రజలు ఏం ఆశించారు. జగన్ ప్రభుత్వం చేసింది ఏమిటి ..?ఒక‌్క సారి అవలోకనం చేసుకుందాం.
2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకూ ప్రతినిధులను ఎన్నుకున్నారు. వైఎస్సార్ సీపీ 151స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో, జనసేన పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇది జగన్‌కు అపూర్వ విజయం. ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్బంగానూ, తిరిగి తన ప్రమాణ స్వీకార సమయంలోనూ జగన్ ఒక్కటే మాట చెప్పారు. ఈ విజయం దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో దక్కిందని, ఆరు నెలల్లో జగన్ మంచి సీఎం అనిపించుకునేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
తాను ఇచ్చిన హామీకి తగ్గట్టుగా జగన్ నవరత్నాల అమలు పై దృష్టి కేంద్రికరించారు. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, ఇలా ప్రతి పథకం అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే జగన్ చేపట్టిన అనేక సంస్కరణ లు వివాదాలకు కారణమయ్యాయి. ప్రతి పక్షాలు ప్రతి అంశంలోనూ లోపాలు వెతికే పనిలో పడ్డాయి. అతి తక్కువస్థానాలు ఉన్నా టీడీపీ జగన్ సర్కారును ఇరుకున పెట్టడంలో సఫలం అయ్యింది. ఆరంభంలో కొంతకాలం ఇసుక సమస్య ఇబ్బంది పెట్టింది. కొంతకాలం ఇంగ్లీషు మీడియం పై పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. రాజధాని మార్పు వ్యవహారం, శాసనమండలి రద్దు, ఎన్నికల కమిషన్‌పై జగన్ వ్యవహార శైలీ ఇలా కొ్న్ని అంశాలు ప్రతిపక్షాలకు పనికల్పించాయి.
అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రజల తీర్పు ఇచ్చిన ఈ కాలంలోనే జగన్ కొన్ని సుస్పష్టమైన నిర్ణయాలు తీసుకొవటంతో ప్రజల మన్ననలు పొందారు. విద్యాసంబంధ సంస్కరణల విషయంలో అమ్మ ఒడి, ఇంగ్లీషుమీడియం, వసతి,విద్యాదీవెన చరిత్రలో నిలిచిపోతాయి. దశల వారీ మద్య పాన నిషేదం విషయంలో జగన్ మహిళల ఆదరణ చూరగొన్నారు. మరో వైపు పాలనలో తీసుకొచ్చిన సచివాలయాల ఏర్పాట్లు, వలంటీర్ల వ్యవస్థ దేశంలోనే మార్గదర్శిగా మారాయి. పరిపాలన విషయంలో కొంత గందరగోళం, అనుభవ రాహిత్యం, తాను పట్టిన పంతం వదలక పోవటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న కోర్టు తీర్పులు, మంత్రులకు ప్రాధాన్యత కరువవటం ఇలాంటి మైనస్‌లు జగన్ పాలనలో మెండుగానే ఉన్నాయి. తాజాగా ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదం మరోసారి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ఈ ఏడాది కాలంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ, అధికారులు, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ, ప్రస్తుత కరోనా వ్యాప్తి వేళ సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పటికి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందే అవకాశం ఉంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి