మధ్యతరగతికి మరణశాసనం ... ఇదేదో సినిమా టైటిల్ కాదు... భవిష్యత్తులో జరగనున్న కఠోర వాస్తవం. కరోనా హడావుడి ముగిశాక పరిస్థితులు మళ్ళీ మామూలుగా అయితే ఉండవు. చాలా మంది చిన్నా చితకా ఉద్యోగాలు ఊడి రోడ్డున పడతారు... పెద్ద ఉద్యోగస్తులకు వేతనంలో 30 నుంచి 50 శాతం కోత విధించడం ఖాయం... ఇలాంటి పరిస్థితి ఒకటి దాపురిస్తుందని కలలో కూడా ఊహించని ఉద్యోగులు తమ వేతనాలతో ఎన్నో ఈ.ఎం.ఐ లు కడుతూ ఉంటారు కదా... వారందరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సరిగ్గా పుష్కర కాలం క్రితం అంటే 2008లో అమెరికాలో వచ్చిన ఆర్ధిక సంక్షోభం కారణంగా సాఫ్ట్ వెర్ రంగం అతలాకుతలం అయింది. వేలాదిమంది ఉద్యోగులకు పింక్ కార్డు ఇచ్చి ఉన్నఫళాన ఉద్యోగాలు ఊడగొట్టి ఇంటికి పంపించివేశారు. అధికారిక అంచనాల ప్రకారం 2008 అక్టోబర్, డిసెంబర్ మధ్య మూడు నెలల కాలంలో ఇండియాలో అన్ని రంగాలలో కలిపి 5 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఊహించని ఈ పరిణామంతో ప్లాట్ లు, కార్లు వంటివి తీసుకున్న వారు ఈ.ఎం.ఐ లు కట్టలేని పరిస్థితుల్లో వాటిని తెగనమ్ముకోవలసి వచ్చింది. మరికొందరు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఒక అంచనా ప్రకారం కరోనా కారణంగా మన దేశంలో లక్షా యాభయి వేల మంది ఐ.టి ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. అసలు లేని వాడు కల్లో..గంజో తాగి బతుకుతాడు... మధ్య తరగతి మానవుడు... ఒక రకమైన స్టేటస్ కి అలవాటు పడ్డ వాడు... అక్కడ నుంచి ఒక మెట్టు కిందకు దిగలేక...పైకి వెళ్లే పరిస్థితి అసలే లేక మానసికంగా నలిగిపోతూ నైరాశ్యం లో కూరుకుపోతాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండబోతోందో తల్చుకుంటేనే భయం వేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారో.... అసంఘటిత రంగంలో ఎన్ని కోట్ల మంది పనులు లేక పస్తులు ఉండవలసివస్తుందో... దీనికి తోడు చిన్నా, చితకా కంపెనీలు మూత పడి లక్షలాది మంది కార్మికులు సైతం రోడ్డున పడనున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆకలి కేకలు...ఆకలి చావులు తప్పదు... మరో భయంకర నిజం ఏమిటంటే... పనులు లేక రోడ్డున పడిన నిరుపేద జనం కడుపు మండి దొంగతనాలు, లూటీలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. కరోనా సోకి బలి అయ్యేవారి కంటే... భవిష్యత్తులో ఆ ప్రభావంతో బలవన్మరణం చెందేవారి సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి