Translate

  • Latest News

    9, ఏప్రిల్ 2020, గురువారం

    ఇదేనా క‌రోనా మార్కు సామ్య‌వాదం....

    కరోనా చెపుతున్న పాఠాలు 

    చుట్టూ నిర్మానుష్య వాతావ‌ర‌ణం. ఎండ‌ తీక్ష‌ణంగా ఉంది. కాళ్ల‌కు   చెప్పులు ఎప్పుడు తెగిపోతాయో తెలియ‌దు.. వారంతా వ‌ల‌స కూలీలు. ఎవ‌రైనా తిండిపెడితే తింటున్నారు. లేదంటే మంచినీళ్ల‌తో క‌డుపు నింపుకుంటున్నారు. న‌డుస్తున్నారు.. న‌డుస్తున్నారు.  సొంత ఊరిపై మ‌మ‌కారం. చ‌స్తే సొంత ఊళ్ళోనే చద్దాం కానీ...ఇలా ఎక్కడో దిక్కూ మొక్కూ లేని చావులు మాకొద్దు... అంటూ సొంత ఊరికి నడక మొదలెట్టారు. అయిన  వాళ్ళ చెంతనే   చావాల‌న్న ఆశ‌ వారిని వందల కిలో  మీట‌ర్ల దూరం  న‌డిపిస్తోంది. వారికి కావ‌ల్సింది. పొట్ట నింపుకోవ‌టానికి కూసింత  అన్నం.. కాళ్లు జాపుకోవ‌టానికి కాసింత‌ జాగా. అయితే ఇప్పుడు వారికి  క‌రోనా సోకితే...




    ఉద‌యం లేస్తే వారంతా  బీజిబీజీగా ఉంటారు. కోట్లాది రూపాయాల వ్యాపారం. వారంలో ఎక్కువ రోజులు విదేశాల్లో గడుపుతారు. వారికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. గ‌తంలో వారికి చిన్నపాటి ఆనార్యోగం అని పించినా ఏసీ గ‌దులు,    కార్పోరేట్ ఆసుప‌త్రుల్లో రెస్టు తీసుకొనే వారు. వంగి వంగి స‌లాములు  చేసే డాక్ట‌ర్లు, సిబ్బంది. ఇప్పుడు ఒక‌టే ఆసుప‌త్రి. ప‌క్క బెడ్‌పై కూలీ. కాక‌పోతే కాస్త డ‌బ్బున్న‌వారిప‌ట్ల‌ డాక్ట‌ర్లు, సిబ్బంది కాస్త శ్ర‌ద్ద‌ అంతే...

    పై రెండు సంఘ‌ట‌న‌లు చ‌దివారు గ‌దా మీకేమ‌నిపిస్తుంది. క‌రోనా మ‌నుషుల మ‌ధ్య వైరుధ్యాలను  దూరం చేసిందా. ఇప్పుడు డ‌బ్బులు ఉన్నాయ‌ని క‌రోనా బాధిత‌ కోటిశ్వ‌రుల‌ను హ‌త్తుకుంటారా.. పేద‌వార‌ని  దూరంగా పెడుతున్నారా..ఇప్పుడు మ‌నిషికి మ‌నిషే శ‌త్రువు. క‌రోనా ఉండంటే  ఉలిక్కిప‌డుతున్నారు. మ‌నిషికి బ్ర‌త‌క‌టానికి కావ‌ల్సింది. తింటానికి తిండి, త‌ల‌దాచుకోవ‌టానికి గూడు, క‌ట్టుకోవ‌టానికి బ‌ట్ట‌. ఇవ్వ‌న్నీ స‌గ‌టు మ‌నిషి మ‌నుగ‌డ‌కు కావ‌ల్సిన క‌నీస అవ‌స‌రాలు.



    క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఉద‌యం 6 నుంచి 9 గంటల లోపు  కిరాణా,  కూర‌గాయ‌లు, పాలు, మందుల దుకాణాలు కిక్కిరిసి పోతున్నాయి. ధ‌న‌వంతులు కొన్ని నెల‌లకు సరిపడేలా ఒక్కసారే  స‌ర‌కులు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటుండగా, సామాన్యులు ఉన్నంత‌లో నిత్యావ‌స‌రాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎవ‌రైనా గోల్డ్ షాపుల వైపు చూస్తున్నారా.. కొత్త బండ్లు కొంటున్నారా..సెల్‌ఫోన్లు మారుస్తున్నారా...  ఇవేం లేదు. డ‌బ్బులు ఉన్న‌వారైనా, పేద‌లైనా రేప‌టి తిండి కోస‌మే జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. అంతేనా ఒక‌రిపై మ‌రోక‌రి దాడులు లేవు. పార్టీలు లేవు.. వ‌ర్గాలు లేవు.. క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడో ఒకటీ..అరా..తప్ప.
    ఇప్పుడు ప్రపంచంలో  రెండే వర్గాలు... క‌రోనా సోకిన‌వాళ్లు,  సోక‌ని వాళ్ళు....  క‌రోనా పుణ్య‌మా అని ఇలా సామ్య‌వాదం వ‌చ్చింద‌ని ఆనంద‌ప‌డ‌దామా...! అయితే... ఇది తాత్కాలికమేనండోయి.... తర్వాత కధ మామూలే... ఈ మానవ జాతి అంత తేలికగా మారిపోతుందా... ఇలాంటి కరోనాలు వంద వచ్చి.... సమస్త మానవ జాతి అంతరించిపోయి... మళ్ళీ కొత్త మానవ జాతి అవతరిస్తే తప్ప... ఎందుకంటే... పుట్టుకతో వచ్చింది...పూడికతో కానీ పోదు అన్న సామెత తెలుసుగా.. అంతే మరి...




    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇదేనా క‌రోనా మార్కు సామ్య‌వాదం.... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top