Translate

  • Latest News

    13, మే 2020, బుధవారం

    లాక్ డౌన్ సీరియల్ కు ముగింపు ఎప్పుడు...


    మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తాను ఒక ప్రధాన మంత్రిని అనుకుంటున్నారా లేక బుల్లి తెర సీరియల్ దర్శకుడిని  అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు... మార్చి  21 న ప్రోమో... మార్చి  22న ట్రైలర్ వేసిన ప్రధాని... మార్చి  24 నుంచి నిరాటంకంగా అత్యద్భుతంగా... సస్పెన్సు...థ్రిల్లర్  సీరియల్ ను నడిపిస్తున్నారు... మొదటి అధ్యాయం మార్చి  24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు విజయవంతంగా నడిపించారు.  ప్రేక్షకులను ఉత్కంఠ భరితులను  చేస్తూ చివరి రోజు దాకా లాక్ డౌన్ ఎత్తేస్తారా...కొనసాగిస్తారా అనేది చెప్పకుండా సస్పెన్సు మైంటైన్ చేశారు. మొదటి లాక్ డౌన్ పీరియడ్ రేపటితో ముగుస్తుందనగా... చివరి క్షణంలో మోడీ తెర మీదకు వచ్చి లాక్ డౌన్ 2.0 కొనసాగింపు ప్రకటన అనౌన్స్ చేశారు. మే 3 దాకా అంటే మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ తప్పదని తేల్చేశారు... సరే... 21 ప్లస్ 19 మొత్తం 40 రోజులు పూర్తి చేస్తే కరోనా మండల దీక్ష పూర్తి అవుతుంది... కరోనా మనల్ని వదిలి పారిపోతుంది అనుకుని ప్రజలు ఎవరికీ వారు మోడీ ప్రకటనను శిరసావహించారు... మన డైరెక్టర్ మోడీ గారు మళ్ళీ చివరిదాకా సస్పెన్సు మైంటైన్ చేసి, ఒక రోజు ముందు మళ్ళీ లాక్ డౌన్ 3.0 అనౌన్స్ చేశారు. అయితే ఈ సారి 14 రోజులు అంటే మే 17 వరకు అని ప్రకటించారు.
    40 రోజులైనా లాక్ డౌన్ ఎత్తివేయక పోయేసరికి వలస కూలీలతో ఇక సహనం చచ్చింది.. చావైనా...బతుకయినా... సొంతూళ్లోనే... అనుకుని వందల మైళ్ళు పెళ్ళాం...పిల్లలతో నడక ప్రారంభించారు... ఆ లాంగ్ మార్చ్ లో... ఆ మహా ప్రస్థానంలో... మహాభారతం చివరి అధ్యాయంలో పాండవుల మహా ప్రస్థానంలో పంచ పాండవులు ఒక్కొక్కరూ నేల కొరిగినట్టు... మార్గమధ్యంలో నడవలేక..నడవలేక పసి పిల్లలు నేలకొరిగారు.. నిండు గర్భిణులు దారిలోనే ప్రసవించారు.. ఓ ఘడియ రెస్టు తీసుకుని అప్పుడే పుట్టిన పసిగుడ్డును చంక నెత్తుకుని మళ్ళీ  నడక మొదలెట్టారు.. అలసి..సొలసి...రైళ్ల పట్టాలపై తల వాలిస్తే... ఈ గుడ్డి  ప్రభుత్వం పుణ్యమా అని  శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇలా అంతు లేని కథలు ఎన్నో...ఎన్నెన్నో...
    సరే... మే 17 నుంచి అయినా మనకు మోక్షం లభిస్తుంది అని ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ లోగా మే 12 నుంచి ప్యాసింజర్ రైళ్లు కూడా వదలడంతో ప్రజల ఆశలు రెట్టింపు అయ్యాయి. ఈసారి మన మోడీ గారు నాలుగు రోజుల ముందే లైన్లోకి వచ్చారు... ఏం చెబుతారో అందరూ ఆశగా ఎదురు చూస్తే... సోదంతా చెప్పి... చివర్లో దేశంలో అన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా 20 లక్షల కోట్లు విడుదల చేస్తామని ఒక్క మాట చెప్పి తుర్రుమన్నారు...  మిగతా వివరాలు రేపటి సంచికలో... అన్నట్టు.. మిగతా వివరాలు రేపు మా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెబుతారంటూ ఒక ట్విస్ట్ ఇచ్చి మాయమయ్యారు. లాక్ డౌన్ ఎత్తేసే సంగతేమి తేల్చకుండా మళ్ళీ చివరి రోజు చెబుతానంటూ యధా ప్రకారం తన సస్పెన్సు సీరియల్ ను కొనసాగించారు..జనానికి మళ్ళీ సస్పెన్సు... నిర్మలమ్మ వచ్చి ఏమి చెబుతుందో అని... ఈ లోగా ఎవరికి వారు లెక్కలు వేసేసుకున్నారు ఆ 20 లక్షల్లో తలకు ఎంత వస్తుందని... మన జనాభా ప్రకారం లెక్కలు వేసి... మనిషికి ఒక్కొక్కరికి 15 నుంచి 16 వేల చిల్లర దాకా వస్తుందంటూ లెక్కలు కట్టి వాఁట్సాప్ లలో తెగ వైరల్  చేసేశారు. ఇదండీ సంగతి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లాక్ డౌన్ సీరియల్ కు ముగింపు ఎప్పుడు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top